Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త అథ్లెట్ల‌కు దేశీ భోజ‌నం

  • భార‌త అథ్లెట్ల‌కు ఇచ్చే మెనులో అన్నం, ప‌ప్పు, చ‌పాతీ, పెరుగు, కోడి కూర‌, పులుసులు
  • మ‌న‌వాళ్ల‌ ఆహారం కోసం ఒలింపిక్స్ నిర్వాహ‌కుల‌కు భోజ‌నాల ప‌ట్టిక పంపించామ‌న్న‌ భార‌త డిప్యూటీ చెఫ్ డి మిష‌న్ శివ కేశ‌వ‌న్
  • డాక్ట‌ర్ దిన్‌షా ప‌ర్దీవాలా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అథ్లెట్ల గ్రామంలో భార‌త క్రీడా సైన్స్ కేంద్రం ఏర్పాటు
Indian Food Items in Paris Olympics 2024

ఈ ఏడాది జ‌రిగే పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త అథ్లెట్ల‌కు భోజ‌న ఇబ్బందులు త‌ప్ప‌నున్నాయి. అథ్లెట్ల గ్రామంలో మనోళ్ల‌కు ఎంచ‌క్కా ప‌ప్పు, అన్నం, పెరుగు, చ‌పాతీ వంటి దేశీ భోజ‌నం ల‌భించ‌నుంది. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే భార‌త అథ్లెట్లు ఈసారి బాస్మ‌తి అన్నం, ప‌ప్పు, చ‌పాతీ, ఆలుగ‌డ్డ క‌ర్రీ, కోడి కూర‌, పులుసులు తినొచ్చు. భార‌త అథ్లెట్ల‌కు ఆహారం కోసం ఇప్ప‌టికే ఒలింపిక్స్ నిర్వాహ‌కుల‌కు ఈ మేర‌కు భోజ‌నాల ప‌ట్టిక పంపించామ‌ని భార‌త డిప్యూటీ చెఫ్ డి మిష‌న్ శివ కేశ‌వ‌న్ వెల్ల‌డించారు. 

"భార‌త వంట‌కాల‌తో కూడిన మెను ఉండాల‌నే ప్ర‌తిపాద‌న‌ల‌కు అంగీకారం ల‌భించింది. పోష‌కాహార నిపుణుడి సూచ‌న‌ల మేరకే ఈ దేశీ వంట‌కాల‌ మెనును త‌యారు చేశాం. మ‌న అథ్లెట్ల విష‌యంలో ఆహారం అనేది స‌మ‌స్య. ఒలింపిక్స్‌లో ప్ర‌ధాన భోజ‌నశాల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని ర‌కాల వంట‌కాలు ఉంటాయి. కానీ మ‌న‌వాళ్ల కోసం ద‌క్షిణాసియా వంట‌కాలు కావాల‌ని కోరాం" అని శివ కేశ‌వ‌న్ తెలిపారు. 

రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్‌, క్రికెట‌ర్ రిష‌భ్ పంత్‌కు చికిత్స అందించిన డాక్ట‌ర్ దిన్‌షా ప‌ర్దీవాలా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అథ్లెట్ల గ్రామంలో భార‌త క్రీడా సైన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేశ‌వ‌న్ పేర్కొన్నారు. ఈ కేంద్రంలో అథ్లెట్లు కోలుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, సామగ్రి అందుబాటులో ఉంటాయ‌న్నారు. ఇక ఈ సైన్స్ కేంద్రం ఏర్పాటు కోసం ఇండియా నుంచి భారీ సంఖ్య‌లో యంత్రాల‌ను అక్క‌డికి చేర‌వేసిన‌ట్లు చెప్పారు.

More Telugu News