Radhakishan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్ రావుపై మరో కేసు

Another case registered against former OSD Radhakishan Rao
  • తనపై బెదిరింపులకు దిగారంటూ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీపై కూకట్‌పల్లి వ్యాపారి ఫిర్యాదు
  • తన కూతురి పేరిట సేల్ డీడ్‌‌ను బలవంతంగా రద్దు చేయించారంటూ ఆరోపణ
  • బాధితుడి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తన కూతురు పేరిట కొనుగోలు చేసిన ఫ్లాట్ సేల్ డీడ్‌ను బలవంతంగా రద్దు చేయించారంటూ సుదర్శన్‌ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం, కూకట్‌పల్లిలోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన మునగపాటి సుదర్శన్‌కుమార్ వ్యాపారం చేస్తుంటారు. ఆయన స్నేహితులు, ఎస్ఆర్‌‌నగర్‌కు చెందిన ఎంవీ రాజు, సనత్‌నగర్‌కు చెందిన ఏవీకే విశ్వనాథరాజు తమకు చెందిన రాజేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌లో పెట్టుబడి పెట్టాలన్నారు. ఇందుకు ప్రతి ఫలంగా 10 శాతం వాటా ఇస్తామని చెప్పారు. సుదర్శన్ రూ.60 లక్షలు ఇవ్వగా 2019లో సనత్‌నగర్ జెక్ కాలనీలోని అపార్టుమెంటులో ఫ్లాటు ఇచ్చారు. దీన్ని తన కుమార్తె పేర రిజిస్టర్ చేయించిన సుదర్శన్..అందులోనే నివసిస్తున్నారు. 

రిజిస్ట్రేషన్ తరువాత రెండు నెలలకు ఎంవీ రాజు సుదర్శన్‌కు ఫోన్ చేసి ఫ్లాటు ఇచ్చినందుకు అదనంగా మరో రూ.5 లక్షలు రావాల్సి ఉందని డిమాండ్ చేశాడు. కొన్ని రోజుల తరువాత టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుదర్శన్ ఇంటికొచ్చి ఓ విషయం మాట్లాడాలంటూ సికింద్రాబాద్‌లోని కార్యాలయానికి తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు నిర్బంధించి బెల్టుతో కొట్టారు. ఓఎస్డీ రాధాకిషన్ రావు అసభ్యంగా మాట్లాడుతూ వెంటనే ఫ్లాటు ఖాళీ చేయాలనీ, లేకుంటే రాజు చంపేస్తాడని బెదిరించాడు. దీంతో, భయపడిపోయిన సుదర్శన్, ఫ్లాటు సేల్ డీడ్ రద్దు చేసుకున్నారు. భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన తాజాగా కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4 నిందితుడైన రాధాకిషన్ రావును తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై నాంపల్లి కోర్టులో బుధవారం విచారణ జరిగింది. పోలీసులు 10 రోజుల కస్టడీ కోరగా న్యాయస్థానం ఏడు రోజులకు అనుమతించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనను పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.
Radhakishan Rao
Kukatpally
Hyderabad
BRS
Congress

More Telugu News