IPL 2024: విశాఖ‌లో కోల్‌క‌తా బంప‌ర్ విక్ట‌రీ.. చిత్తుగా ఓడిన ఢిల్లీ!

  • చెల‌రేగిన న‌రైన్‌, ర‌సెల్‌, రఘువంశీ.. కేకేఆర్ 272 ప‌రుగుల‌ రికార్డు స్థాయి స్కోర్ నమోదు
  • ఛేద‌న‌లో చితికిపోయిన ఢిల్లీ.. 17.2 ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగుల‌కే ఆలౌట్‌
  • పంత్ (55), స్ట‌బ్స్ (54) అర్ధ శ‌త‌కాలు వృథా 
  • 106 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చవిచూసిన డీసీ
  • ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 4 మ్యాచుల్లో 3 ఓడిన ఢిల్లీ.. ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి దూసుకెళ్తున్న కేకేఆర్‌
KKR 106 run thrashing of DC in IPL 16th Match at Vizag

విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా బుధ‌వారం జ‌రిగిన ఐపీఎల్ 16వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) ను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ విఫ‌ల‌మైన ఢిల్లీ.. ఏకంగా 106 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చవిచూసింది. కేకేఆర్ నిర్దేశించిన 273 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించ‌డంలో డీసీ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ పంత్ (55), స్ట‌బ్స్ (54) మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఢిల్లీ 17.2 ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వైభ‌వ్‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మిచెల్ స్టార్క్ 2, ర‌సెల్‌, సునీల్ న‌రైన్ త‌లో వికెట్ తీశారు. 

ఇక ఏక‌ప‌క్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఏ దశ‌లోనూ పోటీ ఇవ్వ‌లేదు. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసింది. సునీల్ న‌రైన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స‌ర్ల సాయంతో 85 ప‌రుగులు చేశాడు. యువ ఆట‌గాడు, భార‌త అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2022 హీరో ర‌ఘువంశీ కూడా బ్యాట్ ఝుళిపించాడు. 25 బంతుల్లోనే ఐపీఎల్ త‌న తొలి అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు ఈ యువ సంచ‌ల‌నం. మొత్తంగా 27 బంతులు ఎదుర్కొన్న అత‌డు 3 సిక్సులు, 5 బౌండ‌రీలతో 54 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. సునీల్‌, ర‌ఘువంశీ ద్వ‌యం 104 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించ‌డం విశేషం. 

ఇక చివ‌ర‌లో ర‌సెల్, రింకూ సింగ్‌ మెరుపులు మెరిపించారు. కేవ‌లం 19 బంతులే ఆడిన క‌రేబియ‌న్ ఆట‌గాడు 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 41 ప‌రుగులు పిండుకున్నాడు. అలాగే భారత యువ సంచ‌ల‌నం రింకూ 8 బంతులు ఎదుర్కొని 3 సిక్స‌ర్లు, ఒక బౌండ‌రీతో 26 ప‌రుగులు బాదాడు. ఇలా కోల్‌క‌తా బ్యాట‌ర్లు ఢిల్లీ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ‌డంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే రెండో అత్య‌ధిక స్కోర్ (272) న‌మోదైంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 272 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బౌలర్ల‌లో నోకియా 3, ఇషాంత్ శ‌ర్మ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.   

అనంత‌రం 273 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ ఏ ద‌శ‌లోనూ కేకేఆర్‌కు పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. 4.3 ఓవ‌ర్ల‌లోనే కీల‌క‌మైన 4 వికెట్లు కోల్పోయింది. వైభ‌వ్ ఆరోరా వేసిన రెండో ఓవ‌ర్లోనే ఓపెన‌ర్ పృథ్వీ షా (10) పెవిలియ‌న్ చేరాడు. ఆ త‌ర్వాత మిచెల్ మార్ష్, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ పోరెల్ ఇద్ద‌రూ డ‌కౌట్‌గా వెనుదిరిగారు. ఆ త‌ర్వాత వెంట‌నే వార్న‌ర్(18) కూడా పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాడు. ఇక డీసీ ఓట‌మి లాంఛ‌న‌మే అనుకున్న ద‌శ‌లో సార‌ధి రిష‌భ్ పంత్, స్ట‌బ్స్ జోడీ కేకేఆర్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగింది. ఈ ద్వ‌యం 97 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. ఈ ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. పంత్ 55 ప‌రుగులు చేయ‌గా, స్ట‌బ్స్ 54 ర‌న్స్ కొట్టాడు. వీరిద్ద‌రూ ఔటైన‌ త‌ర్వాత ఢిల్లీ వ‌రుస విరామాల్లో వికెట్లు పారేసుకోవ‌డంతో 17.2 ఓవ‌ర్ల‌లో 166 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఇక ఢిల్లీకి 4 మ్యాచుల్లో మూడో ఓట‌మి ఇది. మ‌రోవైపు కేకేఆర్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించింది.  

ఒకే ఓవ‌ర్‌లో పంత్‌ 4, 6, 6, 4, 4, 4
రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా దాదాపు ఏడాదిన్న‌ర క్రికెట్‌కు దూర‌మైన పంత్.. తిరిగి ఐపీఎల్‌లో పున‌రాగ‌మ‌నం చేసి పాత పంత్‌ను గుర్తు చేస్తున్నాడు. గ‌త సీఎస్‌కే మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీ బాదిన రిష‌భ్ మ‌ళ్లీ నిన్న‌టి మ్యాచ్లోనూ మ‌రో అర్ధ శ‌త‌కంతో ఆక‌ట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్ ఓకే ఓవ‌ర్‌లో 28 ప‌రుగులు చేశాడు. కేకేఆర్ బౌల‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ వేసిన ఓవ‌ర్‌లో 4, 6, 6, 4, 4, 4 బాదాడు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డు
ఈ ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఓ అద్భుత‌మైన రికార్డు న‌మోదైంది. ఈ సీజ‌న్‌లో రెండు సార్లు 250కు పైగా స్కోర్లు న‌మోద‌య్యాయి. ఓకే సీజ‌న్‌లో రెండు సార్లు 250కు పైగా స్కోర్లు ఇప్ప‌టివ‌ర‌కూ నమోదు కాలేదు. ఇవాళ్టి మ్యాచులో కేకేఆర్ 272 ప‌రుగులు చేయ‌గా, వారం రోజుల కింద ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 277 ప‌రుగులు బాదిన విష‌యం తెలిసిందే.   

ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు 200 ప్ల‌స్ స్కోర్ చేసిన జ‌ట్లు ఇవే
సీఎస్‌కే - 29 సార్లు
ఆర్‌సీబీ - 24 సార్లు
ఎంఐ - 23 సార్లు
కేకేఆర్ - 21 సార్లు
పీబీకేఎస్‌- 21 సార్లు

More Telugu News