KKR: వైజాగ్ తీరంలో పరుగుల సునామీ... సన్ రైజర్స్ రికార్డుకు చేరువలోకి వచ్చిన కోల్ కతా

  • విశాఖలో నేడు కోల్ కతా నైట్ రైడర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు
  • 39 బంతుల్లో 85 పరుగులు చేసిన నరైన్
  • దంచికొట్టిన రఘువంశీ, రసెల్, రింకూ సింగ్ 
KKR records second highest total in IPL history

విశాఖలోని ఏసీఏ స్టేడియం నేడు సిక్సర్ల మోతతో దద్దరిల్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బ్యాట్స్ మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 

మొదట సునీల్ నరైన్, ఆ తర్వాత ఆంగ్ క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్... ఇలా ప్రతి ఒక్కరూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. దాంతో కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 272 పరుగులు చేసింది. మరో 6 పరుగులు చేసుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ రికార్డు తెరమరుగయ్యేది. 

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డు సన్ రైజర్స్ పేరిటే ఉంది. ఇటీవలే ముంబయి ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ఇవాళ ఆ రికార్డుకు కేకేఆర్ ఎసరు పెట్టినట్టే కనిపించినా, చివరి ఓవర్లో ఆ జట్టు ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయింది. అయినప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. 

కోల్ కతా బ్యాటింగ్ విషయానికొస్తే... ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసక ఆటతీరుతో మొదట్లోనే ఢిల్లీ బౌలింగ్ ను అతలాకుతలం చేశాడు. నరైన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత అరంగేట్రం ఆటగాడు రఘువంశీ చిచ్చరపిడుగులా ఆడి 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు సాధించాడు. 

రసెల్ 19 బంతుల్లో 41, రింకూ సింగ్ 8 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఆన్రిచ్ నోర్కియా 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్ 1, మిచెల్ మార్ష్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఫీల్డర్లు పలు క్యాచ్ లను అందుకోలేకపోవడం కూడా కోల్ కతా బ్యాటర్లకు కలిసొచ్చింది.

More Telugu News