Revanth Reddy: ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ మనకు ఎంతో ప్రతిష్ఠాత్మకం.. సీటును గెలుచుకుందాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy meeting with Medak lok sabha congress leaders
  • కష్టపడండి.. కలిసికట్టుగా ముందుకు సాగండని పిలుపు
  • మెదక్‌లో పార్టీకి పూర్వవైభవం తీసుకుని వద్దామన్న రేవంత్ రెడ్డి
  • సీటును కాంగ్రెస్ ఖాతాలో వేద్దామన్న ముఖ్యమంత్రి
ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం మనకు ఎంతో ప్రతిష్ఠాత్మకమని... ఈ స్థానంలో పార్టీని గెలిపించి పూర్వవైభవం తీసుకువద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో మెదక్ పార్లమెంట్ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందన్నారు. ఇదే అదనుగా అందరం కలిసికట్టుగా పనిచేసి మెదక్ సీటును కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే విధంగా కృషి చేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి పెరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో మన పథకాలే ప్రచారాస్త్రాలుగా విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు.

మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్‌కు ఓటేసేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే  రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
Revanth Reddy
Congress
Medak District

More Telugu News