Perni Nani: చంద్రబాబుకు పేదలపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా?: పేర్ని నాని

  • ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న పెన్షన్ల వ్యవహారం
  • సచివాలయాల్లో పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం
  • వృద్ధుల ఉసురు తగులుతుందంటూ చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
Perni Nani take a jibe at Chandrababu Naidu

పెన్షన్ల వ్యవహారం ఏపీలో రాజకీయ జ్వాలలు రగిల్చింది. ఎన్నికల వేళ విపక్ష టీడీపీ, అధికార వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా, మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఇన్నాళ్లకు పేదలపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అని మండిపడ్డారు. 

సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారని, వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న చంద్రబాబు, ఈ 1.60 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న పాపిష్టి నోళ్లతోనే 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పకనే చెప్పారని విమర్శించారు. 

2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు పసుపు-కుంకుమ పేరుతో డబ్బులు ఇచ్చినా, జన్మభూమి కమిటీలతో రైతులకు డబ్బులు ఇచ్చినా తాము అడ్డుకోలేదని, ఈసీకి ఫిర్యాదు చేయలేదని పేర్ని నాని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం వద్ద భారీ ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు. 

తమ ప్రభుత్వం 58 నెలలుగా ఇంటికెళ్లి పెన్షన్లు అందించిందని, ఈ రెండు నెలలు పెన్షన్లు ఆపినందువల్ల లబ్ధిదారుల్లో జగన్ పై అభిమానమేమీ తగ్గిపోదని పేర్ని నాని స్పష్టం చేశారు. పెన్షన్లు ఆపాలన్న దౌర్భాగ్యపు ఆలోచన వచ్చినవారికి వృద్ధుల ఉసురు తగలకపోదు అని శాపనార్థాలు పెట్టారు.

More Telugu News