రాముడిని మొక్కుదాం... బీజేపీని తొక్కుదాం: కేటీఆర్
- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలపై కేటీఆర్ ఆగ్రహం
- రంజిత్ రెడ్డి ఇంటికి వస్తే చాయ్ తాగించి ఓదార్చండి.. కానీ బరాబర్ ఓడగొడుతామని చెప్పండని సూచన
- బీజేపీకి అభ్యర్థులు లేక మన నాయకులను తీసుకొని పోటీ చేయిస్తున్నారన్న కేటీఆర్
- ఓటు వేసే ముందు బీజేపీకి ఎందుకు వేయాలో ఆలోచించండని సూచన
పార్టీ ఎందుకు మారావు? అని సోషల్ మీడియాలో రంజిత్ రెడ్డిని పిల్లలు ప్రశ్నిస్తున్నారన్నారు. రాజకీయాల్లో ఓడినంత మాత్రాన పార్టీ నుంచి వెళ్లిపోతామా? మన పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ కాంగ్రెస్‌లోకి వెళ్లేవాడా? అవకాశం, స్వార్థ్యం కోసం కాంగ్రెస్‌లో చేరాడన్నారు. ఇలాంటి అవకాశవాదిని ఓడించాలన్నారు. రంజిత్ రెడ్డి ఇంటికి వస్తే చాయ్ తాగించి ఓదార్చండి.. కానీ బరాబర్ ఓడగొడుతామని చెప్పండని కార్యకర్తలకు సూచించారు. రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్‌పై ఆయనకు ప్రేమ లేనప్పుడు.. మనం ఎందుకు ప్రేమ చూపించాలని నిలదీశారు. రంజిత్ రెడ్డి సెంటిమెంట్లకు పడిపోవద్దని... దొంగల పార్టీలో కలిసిపోయావని ముఖం మీదే చెప్పాలని సూచించారు.
ఒక్క మెడికల్ కాలేజీ, సైనిక్ స్కూల్ ఇవ్వని బీజేపీకి మనం ఓటు ఎందుకు వేయాలి? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి అభ్యర్థులు కరవయ్యారన్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, నల్గొండ, వరంగల్‌లో మన పార్టీకి చెందిన వారినే బీజేపీ నాయకులు అభ్యర్థులుగా ప్రకటించారని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి ఒక్కరే ఒరిజినల్ బీజేపీ... కాబట్టి మన నేతలతోనే మనకు పోటీ నెలకొందన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరు.. కేడర్ దిక్కు లేదన్నారు. దేశంలో మోదీ హవా అంత బాగుంటే.. ఇతర పార్టీల నుంచి నాయకులను ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. చిన్న కార్యకర్తను పెట్టినా గెలవాలి కదా? అని ప్రశ్నించారు.
మాట్లాడితే రాముడికి దండం పెడుదాం.. మోదీకి ఓటు వేద్దాం అని అంటున్నారు. హిందువులం కాబట్టి తప్పకుండా రాముడికి దండం పెడుతాం.. కానీ ఓటు వేసే ముందు చేవెళ్లకు బీజేపీ ఏం చేసిందో ఆలోచించాలన్నారు. రైల్వే లైన్ ప్రకటించారా? ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసి పిల్లల నోట్లో మట్టి కొట్టినందుకు మోదీకి ఓటు వేయాల్నా? అన్నారు. పదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. అన్ని ధరలు పెంచినందుకు మోదీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మోదీ ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు.