IRCTC Ooty Package: వేసవిలో కూల్ కూల్ గా చలో ఊటీ, కూనూర్​!

  • హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ కు ప్రత్యేక ప్యాకేజీ రూపొందించిన ఐఆర్ సీటీసీ
  • స్లీపర్ లేదా థర్డ్ ఏసీలో ప్రయాణించే వెసులుబాటు 
  • సింగిల్, ట్విన్, ట్రిపుల్ షేరింగ్ పద్ధతిలో చార్జీలు
IRTC tourism package to Ooty and Coonoor

రాష్ర్టంలో వేసవి ఎండలు దంచికొడుతున్నాయి.. భరించలేనంత వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మరి ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? మీ లాంటి వారి కోసమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సరికొత్తగా ఊటీ, కూనూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఇంకేం.. ఈ వేసవిలో కూల్ కూల్ గా ఇంటిల్లిపాదీ అలా వెళ్లి కాస్త చల్లిగాలికి సేద తీరండి.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కాలం గడిపేయండి. ఇక ఆ ప్యాకేజీ వివరాలేంటంటే...

5 రాత్రుళ్లు, 6 పగళ్ల ప్యాకేజీ

ఈ ప్యాకేజీ కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభమవుతుంది. ప్రతి మంగళవారం ఇది అందుబాటులో ఉంటుంది. స్లీపర్ లేదా థర్డ్ ఏసీలో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ముగ్గురు లేదా అంతకన్నా తక్కువ ప్రయాణికులకు ఒక ట్యారిఫ్, ముగ్గురి నుంచి ఆరుగురి వరకు ఉంటే మరో ట్యారిఫ్ ను వసూలు చేయనుంది. పిల్లలు కూడా ఉంటే బెడ్ ఒక చార్జీ, బెడ్ అక్కర్లేకపోతే మరో ట్యారిఫ్ ప్రకటించింది.

ముగ్గురు ప్రయాణికుల్లోపే ఉంటే...

స్లీపర్ లో స్టాండర్డ్ ధర ప్రకారం సింగిల్ షేరింగ్ లో ఒక్కొక్కరికీ రూ. 30,560గా చార్జీని ఐఆర్సీటీసీ నిర్ణయించింది. ట్విన్ షేరింగ్ అయితే రూ. 16,020, ట్రిపుల్ షేరింగ్ లో అయితే రూ. 12,410 చార్జీ ఉంటుంది. అదే కంఫర్ట్ (3ఏసీ) విభాగంలో అయితే సింగిల్ షేరింగ్ లో రూ. 33,020, ట్విన్ షేరింగ్ లో రూ. 18,480, ట్రిపుల్ షేరింగ్ లో రూ. 14,870 ని చార్జీగా ఐఆర్సీటీసీ ఖరారు చేసింది. 

నలుగురి నుంచి ఆరుగురు వరకు ప్రయాణికులు ఉంటే...
స్లీపర్ లో స్టాండర్డ్ ధర ప్రకారం ట్విన్ షేరింగ్ అయితే రూ. 14,470, ట్రిపుల్ షేరింగ్ లో అయితే రూ. 12,120 చార్జీ ఉంటుంది. అదే కంఫర్ట్ (3ఏసీ) విభాగంలో అయితే ట్విన్ షేరింగ్ లో రూ. 16,930, ట్రిపుల్ షేరింగ్ లో రూ. 14,580 ని చార్జీగా ఐఆర్సీటీసీ నిర్ణయించింది.

ప్రయాణం ఇలా..
తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్ప్రెస్ (17230) ద్వారా ప్రయాణం మొదలవుతుంది. మర్నాడు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు స్టేషన్ వద్ద దిగి సమీపంలోని హోటల్లోకి చెకిన్ అవ్వాలి. మధ్యాహ్నం వేళ బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు చూసి రాత్రికి ఊటీలోనే బస చేయాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయం హోటల్లో అల్పాహారం అనంతరం దోడబెట్టా పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శన. రాత్రికి ఊటీలోనే బస.  నాలుగో రోజు హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేశాక కూనూర్ లో సైట్ సీయింగ్ కు ఏర్పాట్లు ఉంటాయి. మధ్యాహ్నం ఊటీకి తిరిగొచ్చి రాత్రికి అక్కడే బస చేయాలి. ఐదో రోజు హోటల్ లో టిఫిన్ అనంతరం మధ్యాహ్నం చెక్ అవుట్ అయి కోయంబత్తూర్ స్టేషన్ కు చేరుకోవాలి. సాయంత్రం 4.35 గంటలకు శబరి ఎక్స్ ప్రెస్ (17229) లో బయలుదేరి ఆరో రోజు రాత్రి 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ముఖ్యమైన అంశాలు..
ఈ ప్యాకేజీలో లంచ్, డిన్నర్ ఉండవు. వాటిని ప్రయాణికులే సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఏసీ అకామడేషన్ కల్పిస్తారు. స్టేషన్ నుంచి వెళ్లేందుకు, వచ్చేందుకు ఏసీ వాహన సదుపాయం ఉంటుంది. పార్కుల్లో ఎంట్రన్స్ టిక్కెట్లు, టూర్ గైడ్ ల కోసం పర్యాటకులే సొంతంగా డబ్బు చెల్లించాలి. మరిన్ని వివరాలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ www.irctctourism.com ను సందర్శించొచ్చు. 


More Telugu News