Dr K Laxman: కవితకు బెయిల్ రాలేదంటే ఆధారాలు గట్టిగా ఉన్నట్లుగా తెలుస్తోంది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

  • రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాఫ్తు కోరాలని డిమాండ్
  • గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణ
  • దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ట్యాపింగ్ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయని వెల్లడి
Laxman responds on Kavitha bail plea

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాలేదంటే ఆధారాలు గట్టిగా ఉన్నట్లు తెలుస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాఫ్తు కోరాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ట్యాపింగ్ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయన్నారు.

ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉందన్నారు. ఇందుకు పూర్తిస్థాయి విచారణ జరగాలన్నారు. అసలు దోషులను ఎట్టి పరిస్థితులలోనూ వదిలిపెట్టవద్దన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు టామ్ అండ్ జెర్రీలా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పరస్పర విమర్శలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ధరణి మీద విచారణకు కమిటీ వేసినప్పటికీ అతీగతీ లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు. ఈ అంశంపై తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

More Telugu News