Virender Sehwag: ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ మార్పుపై వీరేంద్ర సెహ్వాగ్ స్పంద‌న ఇదీ!

  • ఇలాంటి వాటిపై తొంద‌ర‌ప‌డి మాట్లాడితే పొర‌పాటు అవుతుంద‌న్న భార‌త మాజీ క్రికెట‌ర్‌
  • గ‌తంలో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోనూ వ‌రుస‌గా ఐదు మ్యాచులు ఓడిన ఎంఐ టైటిల్ గెలిచింద‌న్న సెహ్వాగ్‌
  • పాండ్యా విష‌యంలో ఇప్పుడే ఓ అంచ‌నాకు రాకుండా మ‌రో రెండు మ్యాచుల వ‌ర‌కైనా వేచి చూడాల‌ని సూచ‌న‌
  • 'క్రిక్‌బ‌జ్' షోలో ముంబై వ‌రుస ఓట‌ములపై వీరేంద్ర‌ సెహ్వాగ్ వ్యాఖ్య‌ 
Virender Sehwag Backs Mumbai Indians Captain Hardik Pandya

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి హార్దిక్ పాండ్యాపై విమ‌ర్శ‌లు ఏ స్థాయిలో వ‌స్తున్నాయో తెలిసిందే. దీనికి తోడు ఆ జ‌ట్టు ఈ సీజ‌న్‌లో ఆడిన మూడు మ్యాచులలోనూ ప‌రాజ‌యం పాలైంది. అందులోనూ సొంత‌మైదానంలో ముంబై ఓట‌మిని అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో పాండ్యాపై విమ‌ర్శ‌లు తార‌స్థాయికి చేరాయి. వెంట‌నే అత‌డిని కెప్టెన్సీ నుంచి తొల‌గించి, రోహిత్‌కే ప‌గ్గాలు అప్పగించాల‌ని కోరుతున్నారు. అయితే, ముంబై కెప్టెన్సీ మార్పుపై భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ భిన్నంగా స్పందించారు. 

ఇలాంటి వాటిపై తొంద‌ర‌ప‌డి మాట్లాడితే పొర‌పాటు అవుతుంది. గ‌తంలో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోనూ వ‌రుస‌గా ఐదు మ్యాచులు ఓడిన ఎంఐ టైటిల్ గెలిచింది. అందుకే ఇప్పుడే ఓ అంచ‌నాకు రాకుండా మ‌రో రెండు మ్యాచుల వ‌ర‌కైనా వేచి చూడాల‌ని సెహ్వాగ్ అన్నారు.  

ఇక ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియ‌న్ అయిన ముంబైను సొంత గ్రౌండ్‌ వాంఖ‌డే స్టేడియంలో సోమ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆరు వికెట్ల తేడాతో ఓడించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంత‌రం ఎంఐ వ‌రుస మూడు ఓట‌ములపై 'క్రిక్‌బ‌జ్' షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యాకు మ‌రికొన్ని మ్యాచులు అవ‌కాశం ఇవ్వాల‌ని అన్నారు. ఈ షోలో భాగంగానే మ‌రో భార‌త మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారీ రాబోయే రోజుల్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొల‌గించి మ‌ళ్లీ రోహిత్ శ‌ర్మ‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అన్నాడు. దీనిపై సెహ్వాగ్ త‌న‌దైన శైలిలో పైవిధంగా స్పందించ‌డం జ‌రిగింది.

More Telugu News