Railway TTE: టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు.. కేరళలో షాకింగ్ ఘటన

  • జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాసులోకి ఎక్కడంపై టీటీఈ ప్రశ్నించడంతో గొడవ
  • పక్కనే పట్టాలపై పడ్డ టీటీఈ.. పైనుంచి దూసుకెళ్లడంతో ముక్కలైన టీటీఈ శరీరం
  • నిందితుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు
TTE pushed to death by ticketless passenger on moving train in Kerala

జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాస్ బోగీలోకి ఎందుకు ఎక్కావంటూ ప్రశ్నించిన టీటీఈని ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలులో నుంచి తోసేశాడు. పక్కనే ఉన్న పట్టాలపై పడ్డ ఆ టీటీఈ పైనుంచి మరో ట్రైన్ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఎర్నాకులం నుంచి పాట్నా వెళ్లే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో వి.వినోద్ (47) టీటీఈ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో స్లీపర్ క్లాస్ లో ప్రయాణికుల టికెట్లు చెక్ చేస్తుండగా రజనీకాంత్ అనే ప్రయాణికుడు జనరల్ టికెట్ తో దొరికాడు. జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ క్లాసులోకి ఎందుకు ఎక్కావంటూ వినోద్ ప్రశ్నించాడు. ఫైన్ కట్టాలని చెప్పడంతో రజనీకాంత్ గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే డోర్ దగ్గర ఉన్న టీటీఈ వినోద్‌ ను రజనీకాంత్ బయటకు తోసేశాడు. కదులుతున్న ట్రైన్ లో నుంచి టీటీఈ వినోద్ పక్కనే ఉన్న ట్రాక్ పై పడ్డారు.

అదే సమయంలో ఆ ట్రాక్ పై వేగంగా దూసుకొచ్చిన మరో ట్రైన్ వినోద్ ను ఢీ కొట్టింది. దీంతో వినోద్ శరీరం ముక్కలుముక్కలై చనిపోయాడు. ముళంగున్నతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్‌ల మధ్య జరిగింది. ఈ షాకింగ్ ఘటన చూసి నివ్వెరపోయిన మిగతా ప్రయాణికులు కాసేపటికి తేరుకుని నిందితుడు రజనీకాంత్ పారిపోకుండా పట్టుకున్నారు. తర్వాతి స్టేషన్ లో రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుల సమాచారంతో రైల్వే సిబ్బంది, అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వినోద్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

More Telugu News