Joe Biden: ఇజ్రాయెల్‌పై విమర్శలు గుప్పించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

  • గాజాలో అమాయక పౌరుల రక్షణకు ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోలేదని విమర్శ
  • మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు సహాయక కార్యకర్తలు మరణించడంపై అమెరికా మండిపాటు
  • త్వరితగతిన విచారణ జరిపి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేసిన బైడెన్
US President Joe Biden once again criticised Israel over its military operation in Gaza

గాజాలో సైనిక చర్య పేరిట భీకర దాడులతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్‌‌పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గాజాలో పౌరుల రక్షణ కోసం ఇజ్రాయెల్ తగిన చర్యలు తీసుకోలేదని అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన వైమానిక దాడిలో గాజాలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బైడెన్ ఈ విధంగా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ఇజ్రాయెల్ వైమానిక దాడిపై బైడెన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు స్వచ్ఛంధ సేవా సంస్థ సహాయకులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని అన్నారు. మృతులంతా యుద్ధ పరిస్థితుల్లో ఆకలితో అలమటిస్తున్నవారికి సహాయాన్ని అందించినవారేనని అన్నారు. ధైర్యంగా, నిస్వార్థంగా సాయం చేసినవారు మృతి చెందడం తీరని లోటు అని వ్యాఖ్యానించారు. కాగా సహాయక సిబ్బందికి చెందిన వాహనాలు ఎందుకు దెబ్బతిన్నాయో విచారణ చేపడతామని ఇజ్రాయెల్ హామీ ఇచ్చిందని, వేగంగా దర్యాప్తు జరపాలని బైడెన్ డిమాండ్ చేశారు. విచారణ అనంతరం కారణాలను బహిర్గతం చేయాలని ఆయన కోరారు.

సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారిపై మంగళవారం జరిగిన వైమానిక దాడి ఒకటే కాదని, వేర్వేరు ఘటనల్లో అమాయకులు చనిపోవడం హృదయవిదారకమని అన్నారు. గాజాలో మానవతా సహాయక చర్యలు సంక్లిష్టంగా మారడానికి ఇదే ప్రధాన కారణమని అన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నవారి రక్షణకు ఇజ్రాయెల్ తగినంత చేయలేదని బైడెన్ విమర్శించారు. గాజాలో పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఇజ్రాయెల్‌ను పదేపదే కోరుతున్నామని బైడెన్ చెప్పారు.

కాగా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మృతి చెందినవారంతా పాలస్తీనియన్లకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్న ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ అనే స్వచ్ఛంధ సేవా సంస్థలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మృతుల్లో ఒక అమెరికన్, ముగ్గురు బ్రిటీష్ పౌరులు, ఒక ఆస్ట్రేలియన్, ఒక పోలాండ్ వ్యక్తి, ఒక అమెరికన్-కెనడియన్ ద్వంద్వ పౌరసత్వం, ఒకరు పాలస్తీనియన్‌లు ఉన్నారు.

More Telugu News