Imran Khan: నా భార్యకు జైలులో విషమిచ్చారు.. ఇమ్రాన్ సంచలన ఆరోపణలు

  • పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ దంపతులు
  • బుస్రాబీబీకి జైలులో విష ప్రయోగం జరిగిందని కోర్టుకు తెలిపిన ఇమ్రాన్
  • ఆమె శరీరం, నాలుకపై మచ్చలు వచ్చాయన్న మాజీ ప్రధాని
  • ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్
  • ఆమెకు ఏదైనా జరిగితే ఆర్మీచీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక
Imran Khan claims wife Bushra Bibi poisoned in sub jail

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య బుస్రా బీబీకి జైలులో విషమిచ్చారని ఆరోపించారు. 190 మిలియన్ పౌండ్ల తోషఖానా అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఇమ్రాన్ ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్నారు. నిన్న ఈ కేసు విచారణ  సందర్భంగా జడ్జ్ నాసిర్ జావేద్ రాణాకు తన వాదన వినిపిస్తూ తన సబ్ జైలు (ఇమ్రాన్ ప్రైవేటు నివాసాన్ని సబ్ జైలుగా మార్చారు)లో తన భార్యపై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. ఫలితంగా ఆమె శరీరంపైనా, నాలుకపైనా మచ్చలు వచ్చాయని తెలిపారు. ఆమెకు ఏదైనా జరిగితే ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీని వెనక ఎవరున్నారో తనకు తెలుసని పేర్కొన్నారు.

ఇస్లామాబాద్‌లోని బనీ గాలా రెసిడెన్స్ (సబ్‌జైలు), రావల్పిండిలోని అడియాలా జైలును ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నియంత్రిస్తోందని, తమకు ఏదైనా జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బుస్రా బీబీకి షౌకత్ ఖానుమ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఆసిం చికిత్స అందించాలన్న కోర్టు ఆదేశాలపైనా ఇమ్రాన్ స్పందించారు. డాక్టర్ అసీం గతంలోనూ తన భార్యను పరీక్షించారని, అసీంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు. విష ప్రయోగంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

కాగా, తోషఖానా కేసులో కిందికోర్టు విధించిన 14 ఏళ్ల జైలుశిక్షను హైకోర్టు రద్దుచేసి ఇమ్రాన్ దంపతులకు బెయిలు మంజూరుచేసింది. అయినప్పటికీ ఇతర కేసుల్లో వారు శిక్ష అనుభవిస్తుండడంతో బెయిలు లభించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

More Telugu News