Taiwan Earth Quake: తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్‌లో సునామీ హెచ్చరికలు!

Big earthquake in Taiwan strongest in 25 years tsunami warnings in Japan
  • బుధవారం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం
  • హువెలిన్ నగరానికి నైరుతివైపున 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం 
  • రాజధాని తైపీ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు 
  • భూకంప తీవ్రతకు భారీ భవంతులు పక్కకు ఒరిగిన దృశ్యాలు వైరల్
  • జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ
తైవాన్‌లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైనట్టు తైవాన్ భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. తైవాన్‌లోని హువెలిన్ నగరానికి నైరుతి వైపు 18 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 35 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. భూకంపం కారణంగా తైవాన్‌లోని పలు ప్రాంతాలు తీవ్రంగా కంపించాయి. అనేక భవంతులు పక్కకు ఒరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత 25 ఏళ్లలో తైవాన్‌లో ఈ స్థాయి భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. 1999లో నాంటో కౌంటీలో సంభవించిన భూకంపం (7.2 తీవ్రత) కారణంగా 2, 500 మంది మరణించగా మరో 1,500 మంది గాయపడ్డారు. 

కాగా, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. రాజధాని తైపీతో పాటు పలు ప్రాంతాల్లో పలుమార్లు భూమి కంపించినట్టు వెల్లడించింది. భూకంపం నేపథ్యంలో రాజధాని తైపీతో పాటూ తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో రైలు సర్వీసులు రద్దు చేశారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చుకోవచ్చని కూడా ప్రభుత్వం పేర్కొంది. 

మరోవైపు, తైవాన్‌ భూకంపం నేపథ్యంలో పొరుగున ఉన్న జపాన్ కూడా అప్రమత్తమైంది. జపాన్‌లోని యోనుగుని ద్వీపానికి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా, జపాన్‌లోని ఒకినావా ప్రిఫెక్చర్‌లోని (రాష్ట్రం) తీర ప్రాంతాలకు జపాన్ మెటియొరొలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి కోస్తాతీరంలో సముద్రం అలలు 3 మీటర్ల ఎత్తువరకూ ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేయడం గత 26 ఏళ్లలో ఇదే తొలిసారి. అయితే, పరిస్థితి పరిశీలించిన అనంతరం, జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. 

మరోవైపు, జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ దళాలు కూడా రంగంలోకి దిగాయి. సహాయక చర్యల సన్నద్ధతను సమీక్షించాయి. ఒకినావాతో పాటు కగోషిమా ప్రాంతాల్లో కొన్ని విమాన సర్వీసులు రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. అయితే, తమకు ఎటువంటి సునామీ ప్రమాదం ఉండకపోవచ్చని చైనా భావిస్తోంది. రెండు భూఫలకాల సరిహద్దులో తైవాన్ ఉండటంతో అక్కడ నిత్యం భూకంపాలు సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
Taiwan Earth Quake
Taipei
Japan
Tsunami

More Telugu News