IPL 2024: నిప్పులు చెరిగిన మ‌యాంక్ యాద‌వ్‌.. ఆర్‌సీబీ ఓట‌మి!

  • తిరుగులేని ప్రదర్శనతో వరుసగా 2వ విజయం సాధించిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్
  • మ‌రోసారి మ‌యాంగ్ యాద‌వ్ మాయ‌.. బ్యాటింగ్‌లో క్వింటాన్ డికాక్ విజృంభ‌ణ‌ 
  • రెండోసారి సొంత‌మైదానంలో కంగుతిన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు
LSG won by 28 runs in IPL 15th Match at Bengaluru

బెంగ‌ళూరు వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తో జ‌రిగిన మ్యాచులో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ఓట‌మి చ‌విచూసింది. 182 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ.. 19.4 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో ఎల్ఎస్‌జీ 28 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ‌రోసారి భార‌త యువ సంచ‌ల‌నం మ‌యాంక్ యాద‌వ్ నిప్పులు చెరిగే బంతుల‌తో బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌ను హ‌డ‌లెత్తించాడు. 4 ఓవ‌ర్లలో కేవ‌లం 14 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

అంత‌కుముందు మొద‌ట టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నోకు ఓపెన‌ర్లు క్వింటాన్ డికాక్‌, కేఎల్ రాహుల్ శుభారంభం ఇచ్చారు. ఈ జోడి మొద‌టి వికెట్‌కు 53 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. రాహుల్ 20 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద పెవిలియ‌న్ చేర‌డంతో ఈ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన ప‌డిక్క‌ల్ (06), మార్క‌స్ స్టానిక్స్ (24) త్వ‌ర‌గానే వెనుదిరిగారు. మ‌రోవైపు క్వింట‌న్ డికాక్ వికెట్లు ప‌డుతూ త‌న‌దైన ఆట శైలితో ఆక‌ట్టుకున్నాడు. స్కోర్ బోర్డును ప‌రుగులు తీయించాడు. వ‌రుస‌గా రెండో అర్ధ శ‌త‌కం (81) తో ఆకట్టుకున్నాడు. 

ఇక చివ‌ర‌లో నికోల‌స్ పూర‌న్ మెరుపులు మెరిపించాడు. కేవ‌లం 21 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఈ క‌రేబియ‌న్ ఆట‌గాడు 5 సిక్స‌ర్లు, ఒక బౌండ‌రీ సాయంతో 40 ప‌రుగులు చేశాడు. దీంతో ఎల్ఎస్‌జీ స్కోర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగుల‌కు చేరింది. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో గ్లెన్ మ్యాక్స్ వెల్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. టాప్లీ, య‌శ్‌ ద‌యాల్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్ త‌లో వికెట్ తీశారు. 

ఇక 182 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీకి ఓపెన‌ర్లు విరాట్ కోహ్లీ (22), డుప్లెసిస్ (19).. 40 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించారు. ఈ జోడి ధాటిగా ఆడ‌డంతో బెంగ‌ళూరు 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 36 ప‌రుగులు చేసింది. కానీ, ఆ త‌ర్వాత బెంగ‌ళూరు త‌డ‌బ‌డింది. కేవ‌లం 3 ప‌రుగుల వ్య‌వ‌ధిలో కీల‌క‌మైన 3 వికెట్లు పారేసుకుంది. విరాట్‌ను మ‌ణిమార‌న్ పెవిలియ‌న్ చేర్చ‌గా.. డుప్లెసిస్ ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన‌ మ్యాక్స్‌వెల్‌(0) ను మ‌యాంక్ యాద‌వ్ ఔట్ చేశాడు. ఆదుకుంటాడ‌నుకున్న గ్రీన్ (9) కూడా చెతులెత్తేశాడు. గ్రీన్‌ను క‌ళ్లు చెదిరే డెలివ‌రీతో మ‌యాంక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 

మ‌ధ్య‌లో కొద్దిసేపు ప‌టీదార్‌, అనుజ్ రావ‌త్ జోడీ ఆర్‌సీబీ వికెట్ల ప‌త‌నాన్ని ఆపింది. ఈ ద్వ‌యం ఐదో వికెట్‌కు 36 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. అయితే, రావ‌త్ (11) ను  స్టానిక్స్ పెవిలియ‌న్ పంపించ‌డంతో ఈ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత ప‌టీదార్ (29) ను మ‌యాంక్ పెవిలియ‌న్ చేర్చాడు. ఇక చివ‌రి 5 ఓవ‌ర్ల‌లో బెంగ‌ళూరుకు 78 ప‌రుగులు కావాల్సిన స్థితిలో క్రీజులోకి వ‌చ్చిన లొమ్రార్ అనూహ్యంగా చెల‌రేగాడు. య‌శ్ ఠాకూర్ వేసిన ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 6, 4, 6.. ఆ త‌ర్వాత న‌వీనుల్ బౌలింగ్‌లో 6, 4 బాదాడు. దీంతో ఆర్‌సీబీ మ‌ళ్లీ పోటీలోకి వ‌చ్చింది. కానీ, ఈ సంతోషం ఎంతోసేపు నిల‌వ‌లేదు. 

దూకుడు మీద ఉన్న లొమ్రార్‌ను య‌శ్ ఠాకూర్ వెన‌క్కి పంపించాడు. కేవలం 13 బంతులు మాత్ర‌మే ఆడిన లొమ్రార్ 3 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 33 ప‌రుగులు చేయ‌డం విశేషం. ఆ త‌ర్వాత బెంగ‌ళూరు వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది. చివ‌రికి 19.4 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో ల‌క్నో 28 ప‌రుగుల తేడాతో బంప‌ర్ విక్ట‌రీ న‌మోదు చేసింది. 4 ఓవ‌ర్లలో కేవ‌లం 14 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన 3 వికెట్లు తీసిన మ‌యాంక్ యాద‌వ్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. 

చ‌రిత్ర సృష్టించిన మ‌యాంక్ యాద‌వ్‌
ఎల్ఎస్‌జీ యంగ్ బౌల‌ర్ మ‌యాంక్ యాద‌వ్ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా మూడుసార్లు గంట‌కు 155 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు వేసి రికార్డుకెక్కాడు. మ‌యాంక్ కేవ‌లం 2 మ్యాచుల్లో 50 కంటే త‌క్కువ బంతులే వేసి ఈ ఫీట్‌ను సాధించ‌డం విశేషం. ఉమ్రాన్ మాలిక్‌, నోర్జ్టే రెండుసార్లు ఈ ఫీట్ సాధించారు. కాగా, ఐపీఎల్ చ‌రిత్రలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన రికార్డు మాత్రం ఆస్ట్రేలియ‌న్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షాన్ టైట్ పేరిట ఉంది. 2011 ఐపీఎల్ సీజ‌న్‌లో షాన్ టైట్ ఏకంగా గంట‌కు 157.71 కిలోమీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. చిన్నపాటి వ్య‌త్యాసంతో 13 ఏళ్ల ఈ రికార్డును గెరాల్డ్ కోయెట్జీ (గంటకు 157.40 కిలోమీటర్లు) అధిగ‌మించ‌లేకపోయాడు.

More Telugu News