Chiranjeevi: నా జన్మ సార్ధకమైంది: 'సావిత్రి క్లాసిక్స్' పుస్తక ఆవిష్కరణలో చిరంజీవి!

  • సావిత్రి ఆశీస్సులు పొందానన్న చిరంజీవి 
  • ఆమెను ఎప్పటికీ మరిచిపోలేమన్న జయసుధ 
  • సావిత్రితో నటించడం అదృష్టమన్న మురళీమోహన్ 
  • సావిత్రి ఒక నటశిఖరమన్న బ్రహ్మానందం

Savithri Book Release Function

సావిత్రి నటించిన కొన్ని క్లాసికల్ సినిమాల విశేషాలను 'సావిత్రి క్లాసిక్స్' పేరుతో ఆమె కూతురు విజయ చాముండేశ్వరి ఒక పుస్తకాన్ని వేశారు. ఆమె ఈ పుస్తకాన్ని చిరంజీవి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. 'పునాదిరాళ్లు' సినిమాలో సావిత్రిగారితో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె ముందు నేను డాన్స్ చేయడం .. నేను పైకి వస్తానని ఆమె అభినందించడం నాకు ఇంకా గుర్తుంది" అన్నారు. 

"నేను సావిత్రి గారి సినిమాలను ఎక్కువగా చూస్తుంటాను. నాకు తల్లిలాంటి సావిత్రిగారి గురించి చెప్పడానికి ఉద్వేగంతో మాటలు రావడం లేదు. ఈ పుస్తక ఆవిష్కరణకు వారధిగా నిలబడడం నాకు దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తాను. ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం వలన నా జన్మ సార్ధకమైంది" అని అన్నారు. 

మురళీమోహన్ మాట్లాడుతూ .. "నాకు సావిత్రిగారు అంటే చాలా ఇష్టం. అక్కినేనితో కలిసి ఆమె నటించిన సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. అలాంటి నాకు ఆమెతో ఏడెనిమిది సినిమాలు చేసే అదృష్టం కలిగింది. సావిత్రిగారి తరువాత అలాంటి ఆర్టిస్ట్ మళ్లీ ఇంతవరకూ రాలేదు. ఒక రామాయణం .. భారతం .. భాగవతం మాదిరిగా, ప్రతి ఇంట్లోను ఉండవలసిన పుస్తకం ఇది" అని చెప్పారు. 

జయసుధ మాట్లాడుతూ .. " సావిత్రిగారి ఫంక్షన్ కి నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సావిత్రి గారితో కలిసి నటించే ఛాన్స్ ఒకసారి కలిగింది. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సావిత్రి గారి ఫంక్షన్ చేయడానికి ముందుకు వచ్చిన చిరంజీవిగారికి హీరోయిన్స్ అందరి తరఫున థ్యాంక్స్ చెబుతున్నాను" అన్నారు. 

బ్రహ్మానందం మాట్లాడుతూ .. " సావిత్రిగారి పుస్తక ఆవిష్కరణ చిరంజీవిగారి చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. సావిత్రిగారే దగ్గరుండి ఈ ఫంక్షన్ చేయిస్తున్నారని నేను అనుకుంటున్నాను. తాము మహానటులమని అనుకునేవారు, సావిత్రిగారి సినిమా కాదు .. సీన్ కాదు .. ఒక్క ఎక్స్ ప్రెషన్ చూస్తే చాలు, తమ అహంభావాన్ని పక్కన పెట్టేసి నమస్కారం పెట్టేస్తారు. సావిత్రి విశ్వనట మహా వృక్షం .. నటనాంబర వీధిలో ఆమె విహరిస్తూ ఉంటుంది" అని అన్నారు. 

More Telugu News