Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు... ప్రాజెక్టుల గేట్లు: హరీశ్ రావు

  • రేవంత్ రెడ్డి పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న హరీశ్ రావు
  • సమస్యలపైన, పరిపాలన మీద పట్టు ఉన్న తమ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని పిలుపు
  • పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు చేసింది శూన్యమని విమర్శ
Harish Rao says revanth reddy should open projects gates

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరవాల్సింది పార్టీ గేట్లు కాదని... ప్రాజెక్టుల గేట్లు అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చురక అంటించారు. పేగులు మెడలో వేసుకోవడం కాదు... పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మానవబాంబు కావడం కాదు... మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటో డ్రైవర్ సోదరులను ఓదార్చాలని సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... మల్లన్న సాగర్ గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 15 రోజులకు ఒకసారి కో-ఆపరేటివ్ డైరీ ఫామ్ రైతులకు బిల్లులు వస్తుండేవని... కానీ, ఇప్పుడు మూడు నెలలు దాటినా బిల్లులు రాలేదన్నారు.

గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ను మూడుసార్లు గెలిపించిన ప్రజలు, కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు. సమస్యలపైన, పరిపాలన మీద పట్టు ఉన్న వ్యక్తి పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. దుబ్బాకలో పనికి రాని రఘునందన్ రావు ఇప్పుడు మెదక్ పార్లమెంట్‌కు పనికి వస్తాడా? అని ఎద్దేవా చేశారు. వెంకట్రామిరెడ్డి 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. కలెక్టర్‌గా తన పాలన మార్కుతో ఎన్నో అవార్డులను ఈ గడ్డకు తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. 

రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. 100 రోజుల పాలనలో అన్నీ ఉద్దెర మాటలే అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్‌కు ఓటేయండి... కాకపోతే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. యాసంగి వడ్లకు, మక్కలకు రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్... ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని ప్రశ్నించారు. పెన్షన్లు పెంచిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. తులం బంగారం, నిరుద్యోగ భృతి ఇస్తామని కల్లబొల్లి మాయ మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్ అని ధ్వ‌జ‌మెత్తారు.

పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు చేసింది శూన్యం అన్నారు. బీజేపీ చెప్పింది వింటే జోడీ.. లేకపోతే ఈడీ అని ఎద్దేవా చేశారు. 2 కోట్ల ఉద్యోగాల హామీ పేరుతో దేశంలోని నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో పెట్రోల్, డీజిల్, సిలిండర్ రెండింతలు చేసి ఎన్నికల ముందు రెండు రూపాయలు తగ్గించిందన్నారు. ఈ 100 రోజుల పాలనను రేపు ఎన్నికల రెఫరెండంగా చూపించి మనల్ని మోసం చేసే అవకాశం ఉందని... కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మోసపోతామని హెచ్చరించారు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే రూ.2 లక్షల రుణమాఫీ, 4,000 పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని వారికి చెప్పుకునే అవకాశం వస్తుందన్నారు. మనల్ని మోసం చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలన్నారు.

More Telugu News