YS Jagan: మీరంతా అరుంధతి సినిమా చూశారా?: సీఎం జగన్

  • మదనపల్లెలో వైసీపీ మేమంతా సిద్ధం సభ
  • హాజరైన సీఎం జగన్
  • చంద్రబాబు, పవన్, మోదీలను టార్గెట్ చేస్తూ విమర్శలు
CM Jagan satires on Chandrababu in Madanapalle

ఏపీ సీఎం జగన్ మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సభ సందర్భంగా ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం... మాట్లాడదామా, వద్దా? అన్నారు. 

"ఈ ఎన్నికల్లో మనం పోరాడుతోంది ఎవరితోనో తెలుసా... అబద్ధాలనే పునాదులుగా, మోసాలనే అలవాటుగా మార్చుకున్న ఓ జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం. ఆ ముఠా నాయకుడి పేరు నారా చంద్రబాబు నాయుడు! 

మీరంతా అరుంధతి సినిమా చూశారా? ఆ సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా, ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చంద్రబాబు అనే పసుపుపతి అధికారం కోసం వదల బొమ్మాళీ వదల అంటున్నాడు... పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు. 

ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఇంటింటికీ హామీ పత్రం పంపించాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు... చేశాడా? పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు... చేశాడా? ఆడబిడ్డ పుట్టగానే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు... కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయి అని డిపాజిట్ చేశాడా? 

ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలనెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు... ఇచ్చాడా? అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని హామీ ఇచ్చారు... హామీ పత్రం మీద మోదీ బొమ్మ, దత్తపుత్రుడి బొమ్మ కూడా వేసుకున్నారు... చంద్రబాబు సంతకం పెట్టిన పాంప్లెట్ ఇది. 

కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చాడా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు, రాష్ట్రాన్ని సింగపూర్ ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు... ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు... మన మదనపల్లెలో అలాంటిదేమైనా కనిపిస్తోందా? ఇవి ముఖ్యమైన హామీలు... ఆయన మేనిఫెస్టో చూస్తే 650 హామీలు కనిపిస్తాయి. 

ముఖ్యమైన హామీల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మేనిఫెస్టో సంగతి దేవుడెరుగు! ఆ మేనిఫెస్టో ఎవరికీ కనపడదు... ఎన్నికలైపోగానే చెత్తబుట్టలో ఉంటుంది... గతంలో జరిగింది ఇదే! మరి ఇదే పొత్తు, ఇదే ముగ్గురు, ఇవే పార్టీలు... గతంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా, మీటింగులు పెడుతూ మరోసారి ఇదే డ్రామా ఆడుతున్నారు. 2014 కంటే ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ మరో మేనిఫెస్టోతో డ్రామాకు తెరలేపుతున్నారు. 

మళ్లీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికీ బంగారం, ఇంటికో బెంజ్ కారు అంటున్నారు... సూపర్ సిక్స్ అంటున్నారు! దీని గురించి ప్రజలు ఆలోచించాలి. మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు వస్తున్న ఈ పశుపతిని, ఈ పసుపుపతిని ఏ ఒక్కరైనా నమ్మవచ్చా? నమ్మినవారిని నట్టేట ముంచి, అధికారం దక్కించుకోవడానికి, మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలన్నది బాబు ప్లాన్. 

ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు... వీళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం, దోచుకున్నది పంచుకోవడం కోసం. మరి ఇలాంటి బాబుకు, ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా వద్దా? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం వద్దన్న వాళ్లకు బుద్ధి  చెప్పాలా వద్దా? 

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు వెళ్లి అడ్డుకున్న ఇలాంటి పార్టీకి సమాధి కట్టండి. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు చరమగీతం పాడండి. 

బీసీల తోకలు కత్తిరిస్తా అన్న ఇదే చంద్రబాబు తోకను, ఆ బాబును వెనకేసుకొస్తున్న తోకలను కూడా కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. నాన్న గారు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ తో, మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతున్న ఈ చంద్రబాబుకు, ఈ కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించండి. 

జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేది ఏంటో తెలుసా... మీకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది... అధికారంలో ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ఇచ్చిన ప్యాకేజిని గటగటా తాగేసి, తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింకులోనే ఉంటుంది. ఇది ప్రజల మాట!... అంటూ సీఎం జగన్ ప్రసంగించారు.

More Telugu News