Jagan: 99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా?: మదనపల్లె సభలో సీఎం జగన్

  • మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
  • నేడు మదనపల్లెలో సభ
  • ప్రతిపక్షంలో ఉన్న వారు విడివిడిగా రాలేకపోతున్నారని ఎద్దేవా
  • ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరూ చేయలేకపోతున్నారని వ్యాఖ్యలు
CM Jagan speech in Madanapalle

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా నేడు మదనపల్లె సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఏపీలో ఎన్నికలు వస్తున్నాయని, కానీ ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదని ఎత్తిపొడిచారు. అధికారం కోసం గుంపులుగా, తోడేళ్ల మందలా, జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తున్నారని విమర్శించారు. జెండాలు జతకట్టడమే వారి పని అని, మీ గుండెల్లో గుడికట్టడమే జగన్ చేసిన పని అని పేర్కొన్నారు.

ఇలాంటి పొత్తు చూసి భయపడేవారు లేరు

మీ బిడ్డ ప్రతి గుండెలో ఉన్నాడు. మీ గుండెల్లో మన ప్రభుత్వం ఉంది. ఇవాళ మీ బిడ్డ ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ.... ఇంతమంది ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు కుట్రపూరితంగా ఏకమవుతున్నారు. కానీ వారందరికీ తెలియని విషయం ఒకటుంది. 

99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా? అటు, గతంలో పరీక్షలు  రాసినప్పుడు 10 మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ ఈసారి పరీక్ష పాసవుతాడా? మేనిఫెస్టోను బైబిల్ గానూ, ఖురాన్ గానూ, భగవద్గీతగానూ భావించి 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు, 10 శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో నెరవేర్చని మోసకారి బాబు, ఆయన కూటమి ఈసారి నిలబడగలుగుతుందా? 

విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చినా, ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు కానీ, మన పార్టీ  నేతలు  కానీ, మన వాలంటీర్లు కానీ, ఇంటింటా అభివృద్ధి అందుకున్న పేదలు కానీ... వీరిలో ఏ ఒక్కరైనా భయపడతారా?

ఆ నైతికత మాకు మాత్రమే ఉంది
 
ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ యుద్ధానికి మనం ఎలా సిద్ధం అయ్యామంటే... ఇంటింటికీ అందితేనే అది సంక్షేమం అని చూపించాం కాబట్టి, గ్రామానికి మంచి చేయడం అంటే ఇదీ అని చూపించాం కాబట్టి, మంచి చేసే ప్రక్రియలో ఎక్కడా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు కాబట్టి, గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు... వారికి జరగాల్సిన మంచి వారికి జరగాలి అని వారికి సంక్షేమం అందించాం కాబట్టి, ప్రతి ఒక్కరికీ ఇలా మేలు చేయగలిగాం కాబట్టి, గతంలో ఎన్నడూ ఇలా రాజకీయాల్లో జరగలేదు కాబట్టి, గతంలో రాష్ట్రంలో ఇలాంటి పాలన ఎన్నడూ చూడనట్టుగా చేయగలిగాము కాబట్టి... ఇవాళ మనకు మాత్రమే ఇంటింటికీ వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని గత ప్రభుత్వం మీకు ఏం చేసింది అని అడిగి, మనం ఏం చేశామో వారిని అడిగి వారి మనసును తట్టి, వారి హృదయాన్ని గెలిచి, జగన్ సీఎంగా ఉంటేనే ఈ పథకాలన్నీ అమలవుతాయని చెప్పగలిగే నైతికత మనకు మాత్రమే ఉంది.

మళ్లీ ఎందుకు గెలవాలంటే...

ఈసారి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 లోక్ సభ స్థానాలతో మళ్లీ మనమే ఎందుకు గెలవాలి అంటే... మన అక్కచెల్లెమ్మలను ఈ ఐదేళ్ల మాదిరే వచ్చే ఐదేళ్లు కూడా ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలి. కుటుంబాలకు మూలం అక్కచెల్లెమ్మలు. పథకాల సాయంతో వారిని మరింత బలంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో మళ్లీ అధికారం అడుగుతున్నాం. గతంలో ఎవరూ చేయని విధంగా, ఎవరికీ ఆలోచన రాని విధంగా రూ.2.70 లక్షల కోట్లు సంక్షేమం కింద పారదర్శకంగా, అవినీతిరహితంగా అందించాం. 

చంద్రబాబు పేరు చెబితే ఏమీ గుర్తుకు రాదు

బటన్ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా అందించింది రూ.2.70 లక్షల కోట్లు అయితే, నాన్ డీబీటీ కూడా కలిపితే... నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు అందించే గోరుముద్ద, విద్యార్థులకు అందించే ట్యాబ్ లు, విద్యా దీవెన... ఇలాంటివన్నీ కలుపుకుంటే ఈ 58 నెలల కాలంలో అక్షరాలా రూ.3.75 లక్షల కోట్లు మా అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చాం. ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు, ఒక్క రూపాయి లంచం లేదు, ఒక్క రూపాయి దోపిడీ లేదు, ఒక్క రూపాయి కమీషన్ లేదు... ఇదీ మన ట్రాక్ రికార్డు! 

అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు, ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకురాదు. అదే... మీ జగన్ పేరు చెబితే... వార్డు/గ్రామ సచివాలయం, వాటిలో పది శాశ్వత ఉద్యోగాలు, ఇంటికే వచ్చే వాలంటీర్లు, వారు అందించే పెన్షన్, లంచాలు, వివక్ష లేని పాలన, బటన్ నొక్కితే అక్కచెల్లెమ్మల ఖాతాలో నమోదయ్యే ఆర్థికసాయం, విలేజ్ క్లినిక్ లు, ఉచితంగా మందులు, ఉచితంగా వైద్య పరీక్షలు, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం, ప్రపంచస్థాయి చదువులు, పిల్లల చేతుల్లో ట్యాబ్ లు, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన, రైతు భరోసా, గ్రామాల్లో ఆర్బీకేలు, రైతులకు సున్నా వడ్డీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నలకు ఉచిత పంట బీమా, రైతన్నకు ఇన్ పుట్ సబ్సీడీ... ఇవన్నీ గుర్తుకు వస్తాయి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ అన్ని వర్గాలను ఆదుకునేది ఎవరూ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్.

More Telugu News