Floating bridge: నదిలో నీళ్లపై కారు డ్రైవింగ్​.. ఆకట్టుకుంటున్న ఫ్లోటింగ్​ బ్రిడ్జి

  • చైనాలోని షింజియాంగ్ నగర సమీపంలో వంతెన
  • కొండల మధ్య అర కిలోమీటరు పొడవునా నిర్మాణం
  • కార్లు, చిన్న వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా ఏర్పాటు
You can Drive a car on water Impressive floating bridge

మామూలుగా కార్లు ఎక్కడ ప్రయాణిస్తాయి? రోడ్లపైనే కదా.. కానీ అక్కడ మాత్రం నీటిపై ప్రయాణిస్తాయి. నీటిపై అంటే ఏ బ్రిడ్జి పైనో, మరేదో పెద్ద బోటులోనో వెళ్లడం కాదు.. నేరుగా నీటిని తాకినట్టుగా దూసుకెళతాయి. నీళ్లలో అలలకు తగినట్టుగా పైకి, కిందికి ఊగుతూ ప్రయాణిస్తాయి. అది నీటిపై తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జి. ప్రపంచంలోని వినూత్నమైన వంతెనల్లో ఇదీ ఒకటి.

కొండల మధ్య నదిపై..
చైనాలోని షింజియాంగ్ నగర సమీపంలో ఈ తేలియాడే వంతెన ఉంది. చుట్టూ నిటారుగా ఉన్న కొండలు, వాటి మీదుగా రోడ్డు నిర్మించే పరిస్థితి లేకపోవడంతో.. కొండల మధ్య ఉన్న నదిపైనే కొంత దూరం ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిర్మించారు. దీన్ని ‘షిజిగ్వాన్ వాటర్ హైవే’గా పిలుస్తున్నారు. ఈ బ్రిడ్జి నాలుగున్నర మీటర్ల వెడల్పుతో.. అర కిలోమీటరుకుపైగా పొడవుతో ఉంటుంది. ఆ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు, స్థానికులు ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తుంటారు.

అత్యంత జాగ్రత్తగా...
నదిలో నీటిపై తేలియాడుతున్న ఈ వంతెనపై ప్రయాణమంటే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడమే. దీన్ని కట్టిన చోట నది లోతు 60 మీటర్లకుపైనే ఉంటుందట. అంటే సుమారు 15 అంతస్తుల భవనం ఎత్తు. ఈ బ్రిడ్జిపై కారులో వెళ్తుంటే.. నేరుగా నీటిపై నడిపినట్టే.. అనుభూతి కలుగుతుంది. ఆ సమయంలో పెద్ద అలలు ఏర్పడి, వాహనాలు ఊగిపోకుండా.. నిర్ణీత వేగంతోనే నడిపించాలి. పైగా ఒక్కో వాహనానికి మధ్య వంద మీటర్ల దూరం పాటించాలనే రూల్స్ కూడా ఉన్నాయి.

ఈ అనుభూతి వినూత్నంగా ఉండటంతో ఈ వంతెన కోసం పర్యాటకులు పోటెత్తుతున్నారట. ఇటీవల కొందరు పర్యాటకులు దీనికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్ లో పెట్టడంతో వైరల్ గా మారాయి.

More Telugu News