Katchatheevu: కచ్చతీవుపై భారత్ లో రాజకీయ రగడ జరుగుతుంటే... తాము దీనిపై చర్చించనే లేదంటున్న శ్రీలంక

  • భారత్, శ్రీలంక మధ్య ఉన్న దీవి... కచ్చతీవు
  • ఈ దీవిపై హక్కులు వదులుకుంటూ నాడు ఇందిరా గాంధీ సంతకం
  • ఈ అంశాన్ని లేవనెత్తిన ఎన్డీయే సర్కారు
  • అదే స్థాయిలో బదులిస్తున్న కాంగ్రెస్
  • కచ్చతీవు అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీలంక సమాచార శాఖ మంత్రి
Sri Lanka reacts on Katchatheevu conflict

భారత్ కు, శ్రీలంకకు మధ్య ఉండే కచ్చతీవు దీవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీ, కాంగ్రెస్ మధ్య కచ్చతీవు రగడ నెలకొంది. 

కచ్చతీవు దీవిపై భారత్ తన హక్కులను వదులుకుంటోంది అంటూ 70వ దశకంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఓ ఒప్పందంపై సంతకాలు చేయగా... దేశ సమగ్రతను దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో నిర్లక్ష్యపూరితంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించేసిందని మండిపడ్డారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా మోదీ వ్యాఖ్యలను బలపరిచేలా స్పందించారు. 

అయితే, పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కారు... ఇన్నాళ్లు కచ్చతీవును వెనక్కి తెచ్చుకోకుండా ఏం చేస్తోదని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక బీజేపీ ఉద్దేశాలు స్పష్టంగా తెలుస్తున్నాయని విమర్శించారు. 

ఓపక్క కచ్చతీవు అంశంపై భారత్ లో ఈ విధంగా మాటల యుద్ధం జరుగుతుంటే... మరోపక్క శ్రీలంకలో మాత్రం అసలీ అంశమే ప్రస్తావనకు రాలేదని ఓ మంత్రి వెల్లడించారు. శ్రీలంక సమాచార శాఖ మంత్రి బందుల గుణవర్ధనే స్పందిస్తూ... కచ్చతీవు దీవి అంశాన్ని శ్రీలంక క్యాబినెట్ ఇప్పటిదాకా చర్చించలేదని వెల్లడించారు. అంతేకాదు, ఈ దీవి అంశాన్ని ఎవరూ లేవనెత్తలేదని తెలిపారు.

More Telugu News