Alleti Maheshwar Reddy: ధరణి కుంభకోణంలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు?: బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

  • కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శ
  • భూకబ్జాలు చేసిన కేకే, రామ్మోహన్‌లను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్న
  • వారు కాంగ్రెస్‌లో చేరగానే భూకబ్జాలు మాసిపోయి కడిగిన ముత్యంలా తయారయ్యారా? అని నిలదీత
  • ధరణి పేరుతో అతిపెద్ద కుంభకోణం జరిగిందన్న మహేశ్వర్ రెడ్డి
alleti maheshwar reddy fires at revanth reddy for silence on dharani

ధరణి కుంభకోణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? అని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భూకబ్జాలు చేసిన కే కేశవరావు, రామ్మోహన్‌లను కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకున్నారు? అని ప్రశ్నించారు.

వారు కాంగ్రెస్‌లో చేరగానే భూకబ్జాలు మాసిపోయి కడిగిన ముత్యంలా తయారయ్యారా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుల క్లియరెన్స్ కోసం బీ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. బీ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్ ఏమో.. మరి తనకైతే తెలియదన్నారు. బీ ట్యాక్స్ పేరుతో 8 నుంచి 9 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో అతిపెద్ద కుంభకోణం జరిగిందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో రూ.2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. లక్షల ఎకరాల కుంభకోణానికి ధరణి కేంద్రంగా మారిందని విమర్శించారు. ఈ కుంభకోణంలో బీఆర్ఎస్ అధినేత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి మాట్లాడటం లేదని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ను విదేశీ కంపెనీకి అప్పగించారన్నారు.

నియోజక వర్గ ప్రజలు తనకు 50 వేల పైచిలుకు మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించారని.. వారికి రుణపడి ఉంటానన్నారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీ కార్యకర్తగానే కొనసాగుతానన్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ప్రధాని మోదీ వల్లనే సాధ్యమని నమ్మి జీవితంలో మొదటిసారి పార్టీ మారి బీజేపీలో చేరానని... తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటానన్నారు.

More Telugu News