V Hanumantha Rao: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఖ‌మ్మం లోక్‌స‌భ‌ సీటు ఇవ్వాల‌ని కోరా: వి. హ‌నుమంత‌రావు

  • ఒకవేళ త‌న‌కు ఆ సీటు ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాన‌న్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌
  • పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌న అభ్య‌ర్థిత్వం విష‌యంలో పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని వెల్ల‌డి
  • ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో ఎవ‌రెవ‌రు ఉన్నారో పూర్తి వివ‌రాలు ప్ర‌జ‌ల‌కు తెలియాల‌న్న వీహెచ్‌
Congress Senior Leader V Hanumantha Rao Meets CM Revanth Reddy

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ వి. హ‌నుమంత‌రావు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసే విష‌య‌మై మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వీహెచ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసి త‌న‌కు ఖ‌మ్మం పార్ల‌మెంట్ సీటు కావాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. ఒకవేళ త‌న‌కు ఆ సీటు ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాన‌ని కూడా అన్నారు. అయితే, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో త‌న అభ్య‌ర్థిత్వం విష‌యంలో పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణ‌యం తీసుకున్నా క‌ట్టుబ‌డి ఉంటాన‌ని వీహెచ్ స్ప‌ష్టం చేశారు. 

ప్ర‌స్తుతం రాష్ట్రంలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై కూడా హ‌నుమంత‌రావు స్పందించారు. ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రెవ‌రు ఉన్నారో పూర్తి వివ‌రాలు ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అలాగే గ‌తంలో హ‌త‌మైన గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం పేద‌ల భూములు లాక్కున్నాడ‌ని ఈ సంద‌ర్భంగా వీహెచ్ గుర్తు చేశారు. మొత్తం రూ. 2500 కోట్ల ఆస్తులను న‌యీం లాక్కున్నాడ‌ని, అత‌ని మ‌ర‌ణం త‌ర్వాత అవ‌న్నీ ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంలో ఒక్క అంశాన్ని కూడా వ‌దిలిపెట్ట‌కుండా పూర్తి విచార‌ణ జ‌రిపించాల‌ని వీహెచ్ కోరారు. 

More Telugu News