YS Sunitha Reddy: జగనన్న పార్టీకి ఓటు వేయొద్దు.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం: సునీత

  • గతంలో జగన్ ను గుడ్డిగా నమ్మానన్న సునీత
  • పదేపదే మోసం చేయలేరని వ్యాఖ్య
  • వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయన్న సునీత
Dont vote for Jagan YSRCP party says Sunitha

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మరోసారి విమర్శలు గుప్పించారు. తాను, వైఎస్ షర్మిల ఇతరుల ప్రభావంతో మాట్లాడుతున్నామని అంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగిన తర్వాత మీరు నాతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని అన్నారు. గతంతో మిమ్మల్ని గుడ్డిగా నమ్మానని... మీరు చెప్పినట్టు చేశానని తెలిపారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని.... వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసని చెప్పారు. ఎవరైనా ఒకసారి మోసం చేయొచ్చు... పదేపదే మోసం చేయలేరని అన్నారు. వివేకా హత్య గురించి ఒక అన్నగా తనకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదని... సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని సునీత అన్నారు. అలాంటి పార్టీ నుంచి అందరూ బయటకు రావాలని... లేకపోతే పాపం చుట్టుకుంటుందని చెప్పారు. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దని, ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని అన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలని చెప్పారు. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దామని... వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని అన్నారు. 

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ... ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News