Imran Khan: 'తోషాఖానా' కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ దంపతులకు భారీ ఊరట.. అయినా జైలులోనే!

  • కింది కోర్టు విధించిన 14 సంవత్సరాల జైలు శిక్షను సస్పెండ్ చేసిన ఇస్లామాబాద్ హైకోర్టు
  • ఇద్దత్ కేసులో ఇమ్రాన్ దంపతులకు చెరో ఏడేళ్ల జైలు
  • గూఢచర్యం కేసులో ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు
  • కోర్టు తాత్కాలిక బెయిలు ఇచ్చినా జైలులోనే ఇమ్రాన్
Imran Khans Jail Sentence Suspended In Graft Appeal

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్, ఆయన భార్య బుస్రాబీబీకి కింది కోర్టు విధించిన 14 సంవత్సరాల జైలుశిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకున్నప్పటికీ అధికారం మాత్రం అందకుండా పోయింది. అంతకు వారం రోజుల ముందే ఇమ్రాన్, ఆయన భార్యకు తోషాఖానా (ప్రభుత్వానికి వచ్చిన బహుమతులను అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపణ) కేసులో కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 

కిందికోర్టు విధించిన శిక్ష నుంచి ఇమ్రాన్ దంపతులకు భారీ ఊరట లభించినప్పటికీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదు. వారిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఇద్దత్ కేసులో ఇద్దరికీ చెరో ఏడేళ్లు, గూఢచర్యం ఆరోపణల కేసులో ఇమ్రాన్‌కు పదేళ్ల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో నిన్న ఇస్లామాబాద్ హైకోర్టు వీరికి తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పటికీ జైలు నుంచి విడులయ్యే అవకాశం లేకుండాపోయింది. 

ఇమ్రాన్ ప్రధానిగా వున్నప్పుడు 2018-2022 మధ్య కాలంలో ప్రభుత్వానికి (తోషాఖానా) వచ్చిన విలువైన వస్తువులను ఇమ్రాన్, ఆయన భార్య బుస్రాబీబీ అక్రమంగా వాటిని 140 మిలియన్ పాకిస్థాన్ రూపాయలు (5 లక్షల డాలర్లు)కు విక్రయించినట్టు కేసు నమోదైంది.

More Telugu News