Menaka Gandhi: తన కుమారుడికి బీజేపీ టికెట్ రాకపోవడంపై మేనకాగాంధీ స్పందన

  • వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ హైకమాండ్
  • పిలిభిత్ నుంచి జితిన్ ప్రసాదకు అవకాశం
  • ఇంకా చాలా సమయం ఉందన్న మేనకాగాంధీ
Menaka Gandhi reaction on Varun Gandhi not getting BJP ticket

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ హైకమాండ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ అధినాయకత్వం... దీనికి తగ్గట్టుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఈ క్రమంలో ఎందరో సిట్టింగులు, కీలక నేతలకు కూడా టికెట్ నిరాకరిస్తోంది. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీకి సైతం మొండిచేయి ఎదురయింది. ఆయనకు హైకమాండ్ టికెట్ నిరాకరించింది. ఆయనకు బదులుగా మంత్రి జితిన్ ప్రసాదను అభ్యర్థిగా ప్రకటించింది. వరుణ్ తల్లి మేనకాగాంధీకి టికెట్ ఇచ్చింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సుల్తాన్ పూర్ టికెట్ ను మరోసారి ఆమెకు కేటాయించింది. 

మరోవైపు, తన కుమారుడికి టికెట్ దక్కకపోవడంపై మేనకాగాంధీ స్పందించారు. ఇంకా చాలా సమయం ఉందని ఆమె అన్నారు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. బీజేపీలో కొనసాగుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 

వరుణ్ గాంధీ 2009లో పిలిభిత్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో సుల్తాన్ పూర్ నుంచి, 2019లో మరోసారి పిలిభిత్ నుంచి గెలుపొందారు. మరోవైపు, 2014లో పిలిభిత్ నుంచి, 2019లో సుల్తాన్ పూర్ నుంచి మేనకా గాంధీ గెలుపొందారు. కొన్ని నెలలుగా సొంత పార్టీపైనే వరుణ్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ప్రభుత్వ నిర్ణయాల్లో కొన్నింటిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందికి గురి చేశాయి. ఈ క్రమంలో ఆయనను హైకమాండ్ పక్కన పెట్టినట్టు చెపుతున్నారు.

More Telugu News