Group2: శనివారం లోగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు!

  • మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం
  • వేర్వేరు కారణాల దృష్యా మెయిన్స్‌కు అభ్యర్థుల నిష్పత్తిని పెంచాలంటూ విజ్ఞప్తులు
  • పరిశీలిస్తున్న ఏపీపీఎస్సీ అధికారులు.. ప్రిలిమ్స్ లోగా నిర్ణయానికి అవకాశం
Group 2 prelims results by Saturday says Sources

ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు శనివారంలోగా వెలువడే ఛాన్స్ ఉంది. మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ.. ప్రశ్నాపత్రం తెలుగు అనువాదంలో తప్పులు రావడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాలతో ప్రధాన పరీక్ష రాసేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే అభ్యర్థనల నేపథ్యంలో 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ, ప్రభుత్వాన్ని అభ్యర్థులు ఇప్పటికే కోరారు.

పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్‌ రాసేందుకు అవకాశమివ్వాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థనలు అందుతున్నాయి. వీటిని ఏపీపీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రిలిమ్స్‌ ఫలితాలు వెలువడే నాటికి ఈ అంశంపై అధికారిక నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాలున్నాయి. ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, నోటిఫికేషన్‌ వెలువడిన సమయానికి, ప్రిలిమ్స్‌ పరీక్షకు మధ్య ఎక్కువ సమయం లేకపోవడం, ‘భారత సమాజం’ సిలబస్‌కు సంబంధించిన బుక్స్ మార్కెట్‌లోకి ఆలస్యంగా అందుబాటులోకి రావడం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌కు కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు అభ్యర్థులు విన్నవిస్తున్నారు.

More Telugu News