Delhi Court: సీఎం కేజ్రీవాల్ అభ్యర్థనలకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమోదం

  • తీహార్ జైలులో 3 పుస్తకాలు, ఇంట్లో వండిన ఆహారానికి అనుమతి
  • వైద్యుల సూచన మేరకు ఒక కుర్చీ, టేబుల్‌కు కూడా గ్రీన్ సిగ్నల్
  • కేజ్రీవాల్ బీపీ, షుగర్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశం
Delhi Court gives nod to Arvind Kejriwal request for 3 books and special diet in Tihar jail

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలివ్వడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే జైలులో చదువుకోవడానికి పుస్తకాలు సమకూర్చాలని, ఇంట్లో చేసిన ఆహారానికి అనుమతించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనకు కోర్టు ఆమోదం తెలిపింది. భగవద్గీత, రామాయణం, ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ ఈ మూడు పుస్తకాలను కేజ్రీవాల్‌కు అందించేందుకు కోర్టు అనుమతించింది. కేజ్రీవాల్ తన ఇంట్లో వండిన భోజనం, మందులు, ఇంట్లో వాడే పరుపులు, దిండ్లతో పాటు ఇతర నిత్యావసరాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు జైలులో ఆయనకు మతపరమైన లాకెట్‌ కేటాయింపునకు కూడా అనుమతిచ్చింది.

జైలు మాన్యువల్ ప్రకారం వైద్యులు సూచించిన విధంగా ఒక టేబుల్, కుర్చీలకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే జైలు నిబంధనల ప్రకారం వస్తువులు అన్నింటినీ జైలు అధికారులు పరిశీలిస్తుంటారని కోర్టు తెలిపింది. పుస్తకాలు, నోట్‌ప్యాడ్‌లు, పెన్నులు కావాలని కేజ్రీవాల్ కోరితే పరిగణనలోకి తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ బీపీ, షుగర్ లెవల్స్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా కేజ్రీవాల్‌ను తీహార్ జైలులోని నంబర్ 2 జైలులో ఉంచారు. ఇక్కడ 24 గంటలపాటు సీసీటీవీ నిఘా ఉంటుంది. 

కాగా కేజ్రీవాల్ ఉదయం 6.30 గంటల మేల్కోవాల్సి ఉంటుందని జైలు వర్గాలు చెబుతున్నాయి. టీవీ సదుపాయం ఉందని, అయితే ప్రభుత్వ ఛానల్స్ మాత్రమే చూడాల్సి ఉంటుందని వివరించాయి. మరోవైపు మంగళవారం సాయత్రం 4 గంటలకు కేజ్రీవాల్ తన న్యాయవాదులను జైలులోనే కలవనున్నారు.

More Telugu News