CJI Chandrachud: సీబీఐ సహా దర్యాఫ్తు సంస్థలపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

premier probe agencies should focus only on issues of national importance cji dy chandrachud
  • దర్యాఫ్తు సంస్థలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై మాత్రమే దృష్టి సారించాలన్న చంద్రచూడ్
  • సీబీఐపై కేసుల భారం రోజురోజుకూ పెరుగుతోందన్న సీజేఐ
  • సీబీఐ అసలు ఉద్దేశ్యం నెరవేరడం లేదని వ్యాఖ్య
  • జాతీయ భద్రత, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచన
సీబీఐ వంటి దర్యాఫ్తు సంస్థలపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ రైజింగ్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని ప్రధాన దర్యాఫ్తు సంస్థలు జాతీయ భద్రత, దేశ వ్యతిరేక నేరాలకు సంబంధించిన కేసులపై మాత్రమే దృష్టి సారించాలన్నారు. కానీ అవి ఇతర నేరాలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు వదిలి కొసరుపై దృష్టి పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. సీబీఐపై కేసుల భారం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. సీబీఐ అసలు ఉద్దేశ్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాఫ్తు సంస్థలు సెర్చ్, సీజ్ చేసే అధికారాలు, గోప్యతా హక్కుల మధ్య సున్నితమైన సమతౌల్యతను కలిగి ఉండాలన్నారు.

పెరుగుతున్న సాంకేతికతతో పాటు పెరుగుతున్న నేరాలు సీబీఐ వంటి విచారణ ఏజెన్సీలకు సవాళ్లుగా మారాయన్నారు. లెక్కకు మించి క్రిమినల్ కేసులతో సీబీఐపై భారం పెరుగుతోందన్నారు. 'జాతీయ భద్రత, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులపై మాత్రమే దృష్టి పెట్టాల'ని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇందులో ఎక్కువమంది డిప్యుటేషన్‌లో ఉన్న అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. కేసుల విషయంలో విచారణ సంస్థలు సొంతంగా నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

విచారణ ప్రక్రియను డిజిటలైజ్ చేయాలని, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నుంచే ఇది ప్రారంభమవుతుందన్నారు. అధిక కేసుల కారణంగా విచారణ సంస్థలపై ఒత్తిడి పెరుగుతున్నందున.. కేసుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవడం చాలా కీలకమని పేర్కొన్నారు. నిర్మాణాత్మక సంస్కరణలను విచారణ సంస్థలు అప్ గ్రేడ్ చేయాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలన్నారు.
CJI Chandrachud
CBI
ED

More Telugu News