K Kavitha: కవితకు ఇంటి భోజనం, ఆభరణాలు, మెడిటేషన్ కోసం జపమాలను అనుమతించిన కోర్టు

  • కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు
  • దుప్పట్లు, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలు అనుమతించాలన్న కోర్టు
  • మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాదులు
Court orders to home food to K Kavitha

తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అవసరమైన వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమె అరెస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కవిత తనకు అవసరమైన కొన్నింటిని స్వయంగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఆమె ఏర్పాటు చేసుకున్న జపమాల, పుస్తకాలు, పెన్నులు, ఇతర వస్తువులను అనుమతించాలని ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం, దుప్పట్లు తెచ్చుకోవటానికి, ఆభరణాలు ధరించేందుకు కూడా అనుమతించింది. మెడిటేషన్ చేసుకోవడానికి జపమాల, లేసులు లేని బూట్లు, ప్రతిరోజు పత్రికలను అనుమతించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకోవడానికి అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం వెసులుబాట్లు అందించాలంటూ మరోసారి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News