Kesineni Nani: విజయవాడ వెస్ట్ లో ఎన్ని రోడ్లు ఉన్నాయో సుజనాకు తెలుసా?: కేశినేని నాని సెటైర్

  • సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ 
  • బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో సుజనా
  • విమానాల్లో తిరిగే సుజనా నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారన్న కేశినేని నాని
  • కమలం గుర్తుకు ఓటు వేయొద్దని పిలుపు
Kesineni Nani satires on Sujana Chowdary

గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ బీజేపీ నేత సుజనా చౌదరికి ఖరారైన సంగతి తెలిసిందే. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. 

అయితే, సుజనాపై విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో సుజనాకు తెలుసా? అని సెటైర్ వేశారు. విమానాల్లో తిరిగే సుజనా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది నిజమేనా? అని ఎత్తిపొడిచారు. సుజనా గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడు... అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు. 

విజయవాడ వెస్ట్ లో ముస్లింలు, బీసీల జనాభా ఎక్కువని, అలాంటి చోట సుజనా చౌదరికి సీటు ఇచ్చారని వ్యాఖ్యానించారు. దయచేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కమలంపై ఓటు వేయొద్దని కేశినేని నాని పిలుపునిచ్చారు. ఆ పార్టీకి ఓటు వేస్తే ఓటు వృథా అయినట్టేనని అన్నారు. 

వైసీపీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆసిఫ్ పోటీ చేస్తున్నారని, తాము ఆసిఫ్ ను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News