KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు.. షిండేలు కాంగ్రెస్‌లోనే ఉన్నారు: కేటీఆర్

KTR says brs will not targetting revanth reddy government
  • నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని వ్యాఖ్య
  • కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే... ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదన్న కేటీఆర్
  • ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని రేవంత్ రెడ్డి 30వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని నిలదీత
  • మన నాయకుడు ఫెయిల్ కాలేదు... ఓటమిలో ప్రజల తప్పు లేదన్న కేటీఆర్
  • పథకాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్న కేటీఆర్

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని... నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని, ఏక్‌నాథ్ షిండేలు వారి పార్టీలోనే ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన పార్ల‌మెంట్ విస్తృతస్థాయి స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ... నల్గొండ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు పార్లమెంట్ ఎన్నికల్లో జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని... కానీ వారు ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ మాటలు విని మోసపోయామని ప్రజలు వందరోజుల్లోనే గ్రహించారన్నారు. రుణమాఫీ హామీ నెరవేరిస్తే కాంగ్రెస్‌కు ఓటు వేయండి... లేదంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫెయిలైంది మ‌న నాయ‌కుడు కాదు.. అలాగని త‌ప్పు ప్ర‌జ‌ల‌ది కాదన్నారు. కేసీఆర్ మ‌న‌ల్ని న‌మ్ముకున్నాడు... కానీ మన ప్ర‌భుత్వం చేసిన మంచి పనుల్ని ప్ర‌జ‌ల్లోకి మ‌నం తీసుకువెళ్లలేకపోవడంతో ఓడిపోయామ‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే మంచి వేతనాలు ఇచ్చినప్పటికీ ఒకటో తారీఖున జీతం రాలేదని మనకు ఉద్యోగులు దూరమయ్యారన్నారు.

మ‌నం బాగా ప‌ని చేస్తే ఫ‌లితం వస్తుందని... 2018లో ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంలో 12కి 11 అసెంబ్లీ సీట్లు గెలిచామని గుర్తు చేశారు. నల్గొండ పార్ల‌మెంట్‌లో ఆరు గెలిచామన్నారు. కానీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నల్గొండ, భువ‌న‌గిరి స్థానాల్లో ఓడిపోయామన్నారు. ఇప్పుడు 11 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఈ రెండు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎందుకు ఓడ‌దో ఆలోచించి ప‌ని చేయాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌ల‌ను సునిశితంగా గ‌మ‌నిస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News