Harish Rao: ఎన్‌టీఆర్‌, చంద్ర‌బాబు, కేసీఆర్‌లకు వెన్నుపోటు పొడిచిన వ్య‌క్తి క‌డియం: హ‌రీశ్‌రావు

  • బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో హ‌రీశ్‌రావు ప్ర‌సంగం
  • కాంగ్రెస్‌లో చేరిన క‌డియం శ్రీహ‌రికి గుణ‌పాఠం చెప్పాల‌ని కార్యక‌ర్త‌ల‌కు పిలుపు
  • బీఆర్ఎస్ త‌ర‌ఫున‌ గెలిచిన ఎమ్మెల్యే ప‌ద‌వికి క‌డియం వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్
  • ఆరూరి ర‌మేశ్, ప‌సునూరి ద‌యాక‌ర్‌లను బీఆర్ఎస్ నుంచి వెళ్ల‌గొట్టిందే క‌డియం అంటూ మండిపాటు
BRS Leader Harish Rao Criticizes Kadiyam Srihari

బీఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన క‌డియం శ్రీహ‌రిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హ‌రీశ్‌రావు మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో సోమ‌వారం హ‌రీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గులాబీ పార్టీని వ‌దిలి కాంగ్రెస్‌లో చేరిన శ్రీహ‌రికి గుణ‌పాఠం చెప్పాల‌ని, ఆ క‌సి కార్య‌క‌ర్త‌లలో క‌నిపిస్తోందన్నారు. క‌డియం బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయాక పార్టీలో జోష్ పెరిగింద‌ని పేర్కొన్నారు. 

ఎన్‌టీఆర్‌, చంద్ర‌బాబు, కేసీఆర్‌లకు వెన్నుపోటు పొడిచిన వ్య‌క్తి క‌డియం శ్రీహ‌రి అని మండిపడ్డారు. బీఆర్ఎస్ క‌డియంకు ఉప ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం ఇచ్చిందని, అస‌లు ఆయ‌న ఎందుకు పార్టీ మారారో చెప్పాల‌ని హ‌రీశ్‌రావు అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో క‌డియం శ్రీహ‌రి ఇంకో గ్రూప్ పెడ‌తారా? అని ప్ర‌శ్నించారు. త‌న కూతురు కావ్య‌ కోసం ఎంపీ టికెట్ తీసుకుని చివ‌రి నిమిషంలో త‌ప్పుకున్నారని, ఇంత‌కుమించిన ద్రోహం మ‌రోక‌టి ఉంటుందా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ త‌ర‌ఫున‌ గెలిచిన ఎమ్మెల్యే ప‌ద‌వికి ఆయ‌న వెంట‌నే రాజీనామా చేయాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. 

ఆరూరి ర‌మేశ్, ప‌సునూరి ద‌యాక‌ర్‌లను వెళ్ల‌గొట్టిందే క‌డియం అని ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. కావ్య మా నాన్న బ్రాండ్ అంటోంది.. వెన్నుపోటు పొడ‌వ‌టంలోనా బ్రాండ్? అని చుర‌క‌ అంటించారు. క‌డియం శ్రీహ‌రి లాంటి ద్రోహుల‌ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని హ‌రీశ్‌రావు చెప్పుకొచ్చారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి కూడా క‌డియం వెంట‌నే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్నారు.

More Telugu News