Vijay Sai Reddy: పేద ప్రజల సొమ్ము దోచుకున్న దొంగ చంద్రబాబు: విజయసాయి రెడ్డి

  • దేశంలోనే అత్యంత అవినీతి నాయకుడని తెహల్కా గతంలోనే చెప్పిందన్న వైసీపీ నేత
  • వందల కోట్ల ప్రజాధనం లూటీ చేసిన జిత్తులమారి నక్క
  • పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి.. పేరు చెబితే ఒక్క పథకం కనిపించదని విమర్శ
vijayasai reddy extreme allegations on chandrababu naidu

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పేద ప్రజల సొమ్ము దోచుకున్న దొంగ అని విమర్శించారు. పేద ప్రజల నోళ్లు కొట్టి ఆరు లక్షల కోట్ల రూపాయలు కాజేశాడని మండిపడ్డారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత అవినీతి నాయకుడని గతంలో తెహల్కా పత్రిక ఆధారాలతో ప్రచురించిందని గుర్తుచేశారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసని చెప్పారు. చివరకు యువత పేరుతో కూడా దోచుకున్నాడని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. నైపుణ్య శిక్షణ పేరుతో వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లొచ్చాడని చెప్పారు. జిత్తులమారి నక్క లాంటి చంద్రబాబు ఇప్పుడు నీతి బోధలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మొత్తం పద్నాలుగేళ్ల పాటు పనిచేసినా కూడా చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకం పేరు గుర్తురాదని విజయసాయి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో బాగుపడ్డది ఆయన బంధువులేనని, వందలు వేల కోట్లు వెనకేసుకున్నారని మండిపడ్డారు. అమరావతి స్కాం బయటపడకుంటే, ఎవరూ అడ్డుకోకుంటే రాష్ట్రంలో శాశ్వతంగా అధికారం తనదేనని కలలు కన్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశాక ఆయన కన్న కలలన్నీ తారుమారయ్యాయని, దీంతో ప్రజలపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు.
 
పేదలు ఎన్నటికీ పేదలుగానే ఉండాలని, పెత్తందారుల కాళ్ల దగ్గరే వాళ్ల బతుకులు కడతేరిపోవాలని చంద్రబాబు ఆలోచన అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులెందుకని, సంక్షేమ పథకాలతో పేదలను సోమరిపోతులుగా మార్చేస్తున్నారని చంద్రబాబు, ఆయన సామాజికవర్గంతో పాటు ఎల్లో మీడియా గడిచిన నాలుగేళ్లుగా విషం కక్కుతున్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను పక్కకు పెట్టించడం ద్వారా పేదలు, వృద్ధులు, వికలాంగులపై వారు తమ కసి తీర్చుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఇవే ఆఖరు ఎన్నికలని ఆంధ్రప్రదేశ్ జనం పూర్తి స్పష్టతతో ఉన్నారని విజయసాయి రెడ్డి చెప్పారు.

More Telugu News