Nitin Gadkari poll bonds: అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఎక్కువే వస్తాయ్: గడ్కరీ

  • ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలపై కేంద్ర మంత్రి వివరణ
  • టీఆర్పీ ఎక్కువున్న చానళ్లకే యాడ్స్ ఎక్కువిస్తారంటూ పోలిక
  • పార్టీ నడిపేందుకు లీగల్ గా విరాళాలు స్వీకరించామన్న గడ్కరీ
Those Who Have More TRP Get Good Rate In Ads Says Nitin Gadkari

టీఆర్పీ ఎక్కువగా ఉన్న చానళ్లకు అడ్వర్టైజ్ మెంట్లు ఎక్కువ రావడం ఎంత సహజమో ప్రజామోదం ఎక్కువగా ఉన్న రాజకీయ పార్టీగా బీజేపీకి పెద్ద మొత్తంలో విరాళాలు రావడం కూడా అంతే సహజమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఎక్కువ రావడం సహజమేనని, రేపు వేరే పార్టీ అధికారంలోకి వచ్చినపుడు దానికి వచ్చే విరాళాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలకు సంబంధించి ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రచారంపై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి స్పందించారు. ఏ పార్టీ అయినా సరే.. మనుగడలో ఉండాలంటే, పార్టీని నడిపించాలంటే విరాళాలు స్వీకరించక తప్పదని చెప్పారు.

అయితే, ఈ విరాళాల స్వీకరణ అనేది చట్టబద్ధంగా, న్యాయంగా జరగాలని మంత్రి చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ జెండా ఎగురుతుందని, మూడోసారి కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పాటవుతుందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీ సొంతంగా 370 సీట్లకు పైగా గెలుచుకుంటుందని, ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు. ప్రధాని పదవి రేసులో తాను ఉన్నాననే ప్రచారాన్ని గడ్కరీ తోసిపుచ్చారు. తనకలాంటి ఆలోచనలేమీ లేవని, మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు.

కేంద్ర విచారణ సంస్థలను బీజేపీ ఓ ఆయుధంగా వాడుకుంటోందని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి వాటిని ఉసిగొల్పుతోందనే ఆరోపణలపైనా కేంద్ర మంత్రి గడ్కరీ స్పందించారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థల పనిలో బీజేపీ వేలు పెట్టదని, అది తమ పార్టీ సంస్కృతి కూడా కాదని స్పష్టం చేశారు. వాటిపని అవి చేసుకుంటూ వెళతాయని, అభ్యంతరం ఉన్నవారు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం మానుకుని ప్రజల విశ్వాసం పొందేందుకు ప్రయత్నించాలని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హితవు పలికారు.

More Telugu News