Rishab Pant: ఫామ్ లోకి వచ్చిన రిషబ్ పంత్... ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు

  • విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ × చెన్నై సూపర్ కింగ్స్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసిన ఢిల్లీ
  • 32 బంతుల్లో 51 పరుగులు చేసిన పంత్
  • లక్ష్యఛేదనలో 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై
Rishab Panth gain his form

రోడ్డు ప్రమాదంలో గాయపడి దాదాపు 15 నెలల విరామం తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన రిషబ్ పంత్ ఇవాళ బ్యాట్ ఝళిపించాడు. విశాఖలోని ఏసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

ఓపెనర్లు పృథ్వీ షా (43), డేవిడ్ వార్నర్ (52) తొలి వికెట్ కు 93 పరుగులు జోడించి శుభారంభం అందించగా, కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతూ అర్థం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంత్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు సాధించాడు. పతిరణ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ 18 పరుగులు చేశాడు. 

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో పతిరణ 3 వికెట్లు తీయగా, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. 

అనంతరం, 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఖలీల్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే ఓపెనర్లు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1), రచిన్ రవీంద్ర (2)లను సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ చేశాడు. 

ప్రస్తుతం చెన్నై స్కోరు 5 ఓవర్లలో 2 వికెట్లకు 23 పరుగులు. అజింక్యా రహానే (11 బ్యాటింగ్), డారిల్ మిచెల్ (6) క్రీజులో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించాలంటే ఇంకా 90 బంతుల్లో 169 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లున్నాయి.

More Telugu News