Pawan Kalyan: పొత్తు కారణంగా మా పార్టీ నేతలు కూడా బాగా నలిగిపోయారు: పవన్ కల్యాణ్

  • పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం
  • మూడు పార్టీల నేతలతో జనసేనాని చర్చ
  • రాష్ట్రం కోసం మనసుతో స్పందించానని వెల్లడి
Pawan Kalyan held meeting in Pithapuram with three parties leaders

జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో పొత్తు కుదుర్చుకున్నామని వెల్లడించారు. జనసేన-టీడీపీ-బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలకు తావులేని రీతిలో పొత్తు కుదిరిందని అన్నారు. 

జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేదానిపై తాను లెక్కలు వేసుకోలేదని, ఏపీ భవిష్యత్ బాగుండాలి, వైసీపీ కీచక పాలన నుంచి ఏపీ ప్రజలను బయటపడేయాలన్న ఉద్దేశంతోనే ఎలాంటి షరతులు లేకుండా పొత్తు కుదుర్చుకున్నామని పవన్ కల్యాణ్ వివరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. 

"పొత్తు కారణంగా మా పార్టీ నేతలు కూడా బాగా నలిగిపోయారు. చాలామంది ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నామని బాధపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రం కోసం మనసుతో స్పందించాను. బీజేపీ జాతీయ స్థాయి పెద్దలు తమకు ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలు కావాలని కోరితే అంగీకరించాను. జనసేన రెండు ఎంపీ స్థానాలకు పరిమితమైనా, అందరినీ కలుపుకుని వెళ్లాలన్న ఉద్దేశంతో బీజేపీ పెద్దల అభిమతాన్ని కాదనుకుండా ముందుకు వెళ్లాం. 

పొత్తు విషయంలో మూడు పార్టీల్లో మొదటి నుంచి 70 నుంచి 80 శాతం మంది వరకు సానుకూలంగా స్పందించారు. అందువల్ల పొత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. 2014లో పది మందిని ఎన్నికల్లో నిలిపే సత్తా ఉన్నప్పటికీ, విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో సమర్థ పాలన ఉండాలని ఆనాడు కూటమికి మద్దతు ఇచ్చాం. ఇప్పుడు 2024లో మా బలం ఇంకా పెరిగిందని తెలిసినప్పటికీ, ఎలాంటి గందరగోళం లేకుండా ముందుడుగు వేయాలన్న ఉద్దేశంతో, వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో పొత్తులకు చొరవ చూపించాం" అని పవన్ కల్యాణ్ వివరించారు. 

ఇక, చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగిందని, ఆయనను పరామర్శించేందుకు వెళుతుంటే, దారి పొడవునా టీడీపీ శ్రేణులు తమ నాయకుడి కోసం పడిన తపన తనను కదిలించి వేసిందని అన్నారు. అందుకే, రాజమండ్రి కారాగారంలో చంద్రబాబును కలిసిన తర్వాత, తనవంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించానని పవన్ వెల్లడించారు. ఆ తర్వాత తాము కోరుకున్నట్టే బీజేపీ కూడా పొత్తులోకి రావడం ఆనందం కలిగించిందని తెలిపారు. 

పిఠాపురంలో టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను కలుపుకుని వెళతానని జనసేనాని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం, వర్మ గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగకుండా వ్యవహరిస్తామని తెలిపారు. చంద్రబాబు గీసిన గీత దాటను అని వర్మ గారు చెప్పడం ఎంతో ఆనందం కలిగించిందని వెల్లడించారు.

More Telugu News