Chandrababu: ఐదేళ్లు ఆకాశంలోనే తిరిగాడు: బాపట్లలో చంద్రబాబు

  • బాపట్లలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శనాస్త్రాలు
  • లక్షల కోట్ల ప్రజాధనాన్ని ధ్వంసం చేశాడని ధ్వజం 
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నామని వెల్లడి
Chandrababu attends Praja Galam rally in Bapatla

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రజాగళం సభ నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

"గతంలో ఇక్కడ వరదలు వస్తే... నేను వస్తున్నానని తెలిసి తాను కూడా పోటీగా ఇక్కడికి వచ్చాడు. ఆయన పరదాలు కట్టుకుని వచ్చాడు. ఆయన వస్తుంటే రెడ్ కార్పెట్ వేశారు. ఐదేళ్లు ఆకాశంలోనే తిరిగాడు. ఆయన ఆకాశంలో తిరిగితే కింద ఉన్న చెట్లన్నీ నరికేశారు. ఆయన ఆకాశంలో తిరిగితే కింద ఉన్న చెట్లు ఏం చేశాయి తమ్ముళ్లూ! అలాంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. రెండు ఫొటోలు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి వల్ల మీకేమైనా సాయం అందిందా? అలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేస్తారా?" అని ప్రశ్నించారు.

నన్ను నమ్మి భూమి ఇచ్చారు

అమరావతి వంటి రాజధానితో రాష్ట్రం బాగుపడుతుందంటే, అక్కడి రైతులకు నేను ఒక ప్యాకేజి ఇచ్చాను. నన్ను నమ్మి వారు భూములు ఇచ్చారు. 10 వేల ఎకరాలు అన్ని అవసరాలకు పోను మిగులు భూమి ఉంది. గత ఎన్నికల నాటికి అక్కడ భూమి విలువ ఎకరా రూ.10 కోట్లు. 

హైదరాబాదులో హైటెక్ సిటీ మొదలుపెట్టక ముందు అక్కడ భూమి విలువ ఎకరా లక్ష రూపాయలు. హైటెక్ సిటీ కట్టాక అక్కడి స్థలం ధర రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు పెరిగింది. ఇప్పుడక్కడ ఒక ఎకరా రూ.100 కోట్లు. అలాంటిది అమరావతిలో రూ.3 లక్షల కోట్ల ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన దొంగ ఈ జగన్ మోహన్ రెడ్డి.

జగన్ పాలనలోనే బాదుడే... బాదుడు!

తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి. వైసీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా, లేక ఖర్చులు పెరిగాయా? అనేది ఆలోచించుకోవాలి. ఐదేళ్లుగా బాదుడే బాదుడు. ఆర్టీసీ చార్జీలు పెంచేశారు... పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి... విద్యుత్ చార్జీలు 9 సార్లు పెంచారు. చెత్త మీద కూడా పన్ను వేసిన ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలేదు. రాజకీయాలు శాశ్వతం కాదు... మనం చేసిన పనులు శాశ్వతం.

పవన్ కల్యాణ్ మొదటి నుంచి ఒకే మాట చెబుతున్నారు

ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఓ కూటమిగా పోటీ చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ మొదటి నుంచి ఒకే మాట చెబుతున్నాడు... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెబుతున్నాడు. అన్ని పార్టీలు పొత్తు పెట్టుకోవాలని చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. మేం పొత్తు పెట్టుకుంటే జగన్ మోహన్ రెడ్డికి నిద్ర రాదు. కుట్రలు చేస్తాడు... పొత్తు ఫెయిల్ కావాలని చూశాడు. కానీ నేను, పవన్ కల్యాణ్ ఒకటే  ఆలోచించాం. రాష్ట్ర ప్రజల కోసం మనం పొత్తు పెట్టుకున్నాం.... ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు... అని భావించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిర్ణయానికి వచ్చాం. 

ఇతను (జగన్) చేసిన అప్పు చూస్తే, కొత్త అప్పు పుట్టే పరిస్థితి లేదు. రేపు మేం గెలిచాక సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నాం.

జగన్ నాపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు

జగన్ నాపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఐదేళ్ల పాటు కేంద్రం తీసుకువచ్చిన అనేక బిల్లులకు మద్దతు ఇచ్చారు. కేంద్రంలో ముస్లింలపై తీసుకువచ్చిన బిల్లులన్నింటికీ జగన్ మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు నన్ను విమర్శించే హక్కు ఉందా ఇతడికి?

మైనారిటీలకు ఏమైనా చేసింది నేనే. ఉర్దూ యూనివర్సిటీ తీసుకువచ్చాను. ఉర్దూ భాషను రెండో భాష కింద ప్రకటించింది నాటి టీడీపీ ప్రభుత్వమే. 35 వేల మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.150 కోట్ల వరకు ఆర్థికసాయం అందజేశాం. రంజాన్ తోఫా ఇచ్చాం. మౌజన్ లకు, ఇమామ్ లకు మెరుగైన వేతనాలు ఇచ్చాం. ఈ ముఖ్యమంత్రి ఐదేళ్లుగా మైనారిటీలకు ఒక్కటైనా చేశాడా?

More Telugu News