Advani Bharat Ratna: అద్వానీకి భారత రత్న.. ఇంటికి వెళ్లి అందించిన రాష్ట్రపతి.. వీడియో ఇదిగో!

  • ప్రధాని మోదీ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు
  • శనివారం రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రధానోత్సవం
  • అరోగ్యం సహకరించక హాజరుకాలేక పోయిన అద్వాని 
President Droupadi Murmu presented Bharat Ratna to LK Advani

బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆదివారం అద్వానీ నివాసానికి వెళ్లి అక్కడే ఈ పురస్కారం అందించారు. శనివారం రాష్ట్రపతి భవన్ లో భారత రత్న అవార్డుల ప్రధానోత్సవం జరిగిన విషయం తెలిసిందే. మరణానంతరం పీవీకి ప్రకటించిన భారత రత్న అవార్డును ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు అందుకున్నారు. అలాగే మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్‌.స్వామినాథన్‌, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌లకు ప్రకటించిన అవార్డులను వారి కుటుంబ సభ్యులు స్వీకరించారు. చరణ్‌సింగ్‌ మనవడు జయంత్‌ చౌధరి, స్వామినాథన్‌ కుమార్తె నిత్యారావు, కర్పూరీ ఠాకూర్‌ కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకుర్‌లు పురస్కారాలు అందుకున్నారు.

అనారోగ్య సమస్యల కారణంగా ఈ కార్యక్రమానికి అద్వానీ హాజరుకాలేకపోయారు. దీంతో ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లారు. భారత రత్న అవార్డును ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా, అవిభక్త భారతదేశంలోని కరాచీలో జన్మించిన అద్వానీ పద్నాలుగేళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరారు. హైదరాబాద్ (ప్రస్తుతం పాక్ లో ఉన్న సిటీ) లో న్యాయ విద్య పూర్తిచేశారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు. 1970లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు.

1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అదే ఏడాది కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1980లో జనతా పార్టీ తరఫున రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అద్వానీ.. అయోధ్య రథయాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రామజన్మభూమి ఉద్యమానికి ఈ యాత్ర ప్రాణం పోసిందని రాజకీయ వర్గాల ఉవాచ. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేసిన అద్వానీ.. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.

More Telugu News