Atchannaidu: ప్రజలారా! అసలు నిజం ఇదే.. గమనించండి: అచ్చెన్నాయుడు

  • పంచాయతీ అధికారుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించిందన్న అచ్చెన్నాయుడు
  • టీడీపీ వల్లే పెన్షన్లు ఆగిపోయాయని జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • పెన్షన్ కోసం రెడీ చేసిన డబ్బులను జగన్ తన బంధువులకు బిల్లులు చెల్లించేశారని ఆరోపణ
  • వైసీపీ నేతల మాటలు విని జీవితాలను పాడుచేసుకోవద్దన్న అచ్చెన్నాయుడు
AP TDP Chief Atchannaidu Said We Are Not Against Volunteers

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దుర్మార్గమైన తప్పుడు ఆలోచనలతో తన తప్పులను ఇతరుల మీదకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎక్స్‌ ద్వారా పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, దీంతో ఎన్నికల కమిషన్ వారితో సంక్షేమ పథకాలు అందించకుండా జాగ్రత్త పడిందని తెలిపారు. గతంలో పంచాయతీ అధికారుల ద్వారా ఎలాగైతే ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చేవారో ఇప్పుడు కూడా అందించమని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు.

ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టేందుకు ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, టీడీపీపై అభాండాలు వేయడం ప్రారంభించారని, టీడీపీ వల్లే పింఛను ఆగిపోయిందని ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వాలని జగన్ బృందం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిజం ఏంటంటే ప్రతినెలాఖరులో ప్రభుత్వం పెన్షనర్ల కోసం రూ. 2000 కోట్లు డబ్బులు రెడీ చేసి ఉంచుతుందని, ఈ నెల కూడా డబ్బులు రెడీ చేసినప్పటికీ, అందులో రూ. 1500 కోట్లను జగన్ మున్సిపల్ శాఖ పనులకు సంబంధించి తన బంధువులకు బిల్లులు చెల్లించేశారని, ఖజానాలో డబ్బులు ఖాళీ చేసి తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం వల్లే పించన్లు ఇవ్వలేకపోతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యాబట్టారు. కాబట్టి ప్రజలు ఇలాంటి పార్టీ నాయకుల మీద తిరగబడాలని పిలుపునిచ్చారు.

వలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే వేతనాలు పెంచుతామని, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఆదాయం పెంచుకునేలా తయారుచేస్తామని చంద్రబాబు మాటిచ్చారని గుర్తు చేశారు. తాము అండగా ఉంటామని, తప్పుడు పనులు చేయొద్దని, అలా చేస్తే ఎన్నికల కమిషన్ కేసులు పెడుతుందని అన్నారు. వైసీపీ మాటలు వినొద్దని, జీవితాలు బాగు చేసుకోవాలని కోరారు. మీ బాగు కోరే ఈ విజ్ఞప్తి చేస్తున్నానని అచ్చెన్నాయుడు తెలిపారు.

More Telugu News