MV Ruen Ship Resque: హాలీవుడ్ సినిమాను తలపిస్తున్న భారత నేవీ షిప్ రెస్క్యూ ఆపరేషన్.. వీడియో ఇదిగో!

  • హైజాక్ కు గురైన షిప్ ను కాపాడిన వీడియో విడుదల
  • మొత్తంగా 18 షిప్ లను హైజాకర్ల నుంచి కాపాడిన భారత నేవీ సిబ్బంది
  • ‘ఆపరేషన్ సంకల్ప్’ పేరుతో అరేబియా సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్
Navy vs Pirates Of The Arabian Viral Video Of navy operation

ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే నౌకా మార్గం రెడ్ సీ కారిడార్ లో ఇటీవల సముద్రపు దొంగలు (పైరేట్లు) రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. సరుకు రవాణా నౌకలపై దాడులు చేసి, వాటిని హైజాక్ చేస్తుండడంతో ఈ నౌకా మార్గం కాస్తా ప్రమాదకరంగా మారింది. ఈ రూట్ లో ప్రయాణించాలంటే నౌక సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. సరుకు రవాణాకు తీవ్ర ఆటంకంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన భారత నేవీ రెడ్ సీ కారిడార్ లో అరేబియా సముద్రంలో ‘ఆపరేషన్ సంకల్ప్’ చేపట్టింది. హైజాక్ గురైన షిప్ లను విడిపించడం, నౌకా సిబ్బందిని రక్షించడంతో పాటు పైరేట్ల ఆటకట్టించేందుకు సిద్ధమైంది.

2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలకు చెందిన మొత్తం 18 షిప్ లను, అందులోని సిబ్బందిని కాపాడింది. పలువురు పైరేట్లను బంధించి ముంబైకి తీసుకొచ్చి జైలుకు పంపించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఓ నౌకను హైజాకర్ల చెర నుంచి కాపాడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. షిప్ హైజాక్ గురైందన్న సమాచారం అందుకున్నప్పటి నుంచి పైరేట్లను బంధించి తీసుకొచ్చే దాకా.. ఏ క్షణంలో ఏం జరిగిందనే వివరాలను ఈ వీడియో ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఎంవీ రూయెన్ షిప్ ను ఎలా రక్షించారంటే..
2023 డిసెంబర్ 14న మాల్టా దేశానికి చెందిన కార్గో షిప్ రూయెన్ ను ఆరుగురు సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. అరేబియా సముద్రంలో ఈ షిప్ ను పైరేట్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో నౌక సిబ్బంది ఎమర్జెన్సీ సందేశం పంపారు. ఈ మెసేజ్ అందుకున్న భారత నేవీ వెంటనే రంగంలోకి దిగింది. రూయెన్ నౌకను కాపాడేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. హైజాక్ గురైన ఎంవీ రూయెన్ నౌకను ట్రేస్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆరేబియా, ఎర్ర సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టింది. చివరకు మార్చి 14న ఎంవీ రూయెన్ నౌకను సోమాలియా తీరం వైపు వెళుతున్నట్లు గుర్తించి, ఐఎన్ఎస్ కోల్ కతా నౌకను అటుగా మళ్లించినట్లు భారత నేవీ అధికారులు తెలిపారు. 

ఐఎన్ఎస్ కోల్ కతా షిప్ తో ఎంవీ రూయెన్ నౌకను అడ్డగించి, నేవీ విమానంలో సోల్జర్లను పంపించామన్నారు. అక్కడి నుంచి క్షణం కూడా వృధా చేయకుండా ఓవైపు అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే నేవీ సిబ్బందికి ఆపరేషన్ వివరాలు చెప్పడం వీడియోలో కనిపిస్తోంది. విమానంలో ప్రయాణిస్తూ రూయెన్ షిప్ ను విడిపించే ప్లాన్ ను సోల్జర్లు చర్చించుకున్నారు. ఆపై పారాచూట్ ల సాయంతో ఐఎన్ఎస్ కోల్ కతా షిప్ పై ల్యాండయ్యారు. అందులో నుంచి హెలీకాప్టర్ ద్వారా హైజాకర్ల చెరలో ఉన్న ఎంవీ రూయోన్ పై ల్యాండయ్యారు.. షిప్ లోపల బంధీలుగా ఉన్న సిబ్బందిని విడిపించి, పైరేట్లను బంధించారు. వారిని ఐఎన్ఎస్ కోల్ కతాలోకి షిఫ్ట్ చేసి ముంబైకి తరలించారు.

More Telugu News