Kadiam Srihari: కుమార్తె కావ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీ
  • నిన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
  • బీఆర్ఎస్‌ నుంచి కొనసాగుతున్న వలసలు
Kadiam Srihari And Kavya Joined In Congress Party

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కడియం శ్రీహరి.. కుమార్తె డాక్టర్ కావ్యతో కలిసి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. పలువురు నేతలు అధికార పార్టీలోకి వెళ్లగా, మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

పార్టీలో సీనియర్ నేతలు అయిన కడియం శ్రీహరి, కేకే వంటి నేతలు పార్టీని వీడడం అన్నింటికంటే ఎక్కువ సంచలనమైంది. మరీముఖ్యంగా  కడియం కావ్యను వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే, దానిని కాదనుకుని మరీ ఆమె పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడం సంచలనమైంది. పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసిన కావ్య.. ఫోన్‌ట్యాపింగ్, కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు వంటివి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాయని, దీనికితోడు లోక్‌సభ అభ్యర్థిని అయిన తనతో నేతలు ఎవరూ కలిసి రావడం లేదని ఆరోపించారు. కాగా, నిన్న జీహెచ్ఎంసీ మేయర్, కేకే కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News