Election King: తగ్గేదేలే..! ఎన్నికల్లో 238 సార్లు ఓడినా మళ్లీ బరిలోకి..

  • ఎలక్షన్ కింగ్‌గా పేరుపడ్డ తమిళనాడు వాసి పద్మరాజన్
  • 238 సార్లు ఎన్నికల్లో పోటీ, అన్నింటా ఓటమి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
  • మాజీ ప్రధాని పీవీతో కూడా తలపడ్డ వైనం
  • తాజా లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ
Man who lost in 238 elections to contest from Dharmapuri in Tamil Nadu

ఎన్నికల్లో 238 సార్లు ఒటమి.. గెలుపన్నదే తెలీని రాజకీయ ప్రయాణం. ఇది చాలదన్నట్టు ఎన్నికల ఖర్చు కింద రూ.కోటి వృథా. వైఫల్యానికి పర్యాయపదంగా మారిన ఈ తమిళనాడు వ్యక్తి మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకర్గం నుంచి నామినేషన్ కూడా దాఖలు చేశారు. 

తమిళనాడులోని సేలంకు చెందిన కె. పద్మరాజన్ వయసు 65. టైరు రిపేర్ షాపు నడుపుకుంటూ ఉంటారు. ఎలక్షన్ కింగ్‌గా ప్రాచుర్యం పొందిన ఆయన ఇప్పటివరకూ 238 సార్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి అధ్యక్ష ఎన్నికల వరకూ ఆయన బరిలో లేని పోటీయేలేదు. విజయం సాధించిన సందర్భమూ లేదు. జీవితమంతా ఓటములు ఎదుర్కొంటున్నా పద్మరాజన్ మాత్రం ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఉత్సాహంగా రంగంలోకి దిగుతారు. అయితే, ఈ వరుస వైఫల్యాలు ఆయనకు ఓ అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎన్నికల చరిత్రలో అత్యధిక సార్లు విఫలమైన వ్యక్తిగా పద్మరాజన్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఢిల్లీ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. 

‘‘అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, జయలలిత, ఎమ్. కరుణానిధి, ఏకే ఆంటొనీ, వాయలార్ రవి, బీఎస్ యడియూరప్ప, ఎస్. బంగారప్ప, ఎస్ఎమ్ కృష్ణ. విజయ్ మాల్యా, సదానంద గౌడ,  అన్బుమణి రామదాస వంటి ఉద్దండులతో తలపడ్డా. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆరు సార్లు పోటీ చేశా. నాకు గెలవాలని ఉండదు. ఓడిపోవాలనేదే నా కోరిక. గెలుపు తాత్కాలికం, ఓటమి శాశ్వతం’’ అని పద్మరాజన్ తనదైన ఫిలాసఫీ వల్లెవేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. 

ఎన్నికలపై పద్మరాజన్ ఇప్పటివరకూ రూ. కోటి రూపాయలను ఖర్చు చేశారు. అయినా, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. టైరు రిపేరు షాపు ద్వారా వచ్చిన ఆదాయం ఎన్నికలకు ఖర్చు చేస్తుంటారు. 1991లో పీవీపై పోటీ చేసిన సమయంలో ఆయనపై కిడ్నాప్ యత్నం కూడా జరగడం కొసమెరుపు.

More Telugu News