Juice Jacking: పబ్లిక్ ప్లేసుల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వాడొద్దు.. దేశప్రజలకు హెచ్చరిక

Centre issues warning over USB charger scam Heres how to stay safe
  • బహిరంగ ప్రదేశాల్లోని చార్జింగ్ పోర్టులతో జ్యూస్ జాకింగ్ ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరిక
  • ఫోన్లలో మాల్‌వేర్లు చొప్పించి వ్యక్తిగత డేటా చోరీ చేస్తారని వార్నింగ్
  • చార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వంటి  ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సూచన
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల వంటి పబ్లిక్ ప్లేసుల్లో ఉండే మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్రం దేశ ప్రజలను తాజాగా హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఫోన్లలోకి మాల్‌వేర్ చొప్పించి, డేటా తస్కరణ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏమిటీ జ్యూస్ జాకింగ్..
చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమైన ఫోన్లలో మాల్‌వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్‌వేర్లను యూజర్‌కు తెలీకుండా ఇన్‌స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడేవారికి డేటా తస్కరణ రిస్కుతో పాటూ నిందితులు ఈ సమాచారంతో  డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కొన్ని కీలక సూచనలు చేసింది. 

జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే..
  • చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు రెడీ చేసుకోవాలి
  • డివైస్‌ను ఎప్పుడూ లాక్ చేసి పెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ను పిన్ లేదా ఇతర విధానాల్లో తెరిచేలా ఏర్పాటు చేసుకోవాలి. పెద్దగా పరిచయం లేని చోట్ల ఉన్న చార్జింగ్ పాయింట్లను వాడకపోవడమే మంచిది. వీలైనంత వరకూ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. 
  • సైబర్ దాడులు జరిగిన సందర్భాల్లో 1930 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలి. ప్రభుత్వ వెబ్‌సైట్ www.cybercrime.gov.in ను సందర్శించి కూడా వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు.
Juice Jacking
Mobile Charging Point
Public Places
Cybercrime

More Telugu News