LSG VS PBJ: ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్

  • పంజాబ్ కింగ్స్‌పై 21 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ
  • కెప్టెన్ శిఖర్ ధావన్ రాణించినప్పటికీ ఎదురైన ఓటమి
  • అరంగేట్ర మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించిన లక్నో ఆటగాడు
Mayank Yadav stars as LSG beat Punjab Kings by 21 runs in IPL 2024

ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ 70 పరుగులతో రాణించినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం తప్పలేదు. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో రాణించడంతో ఈ మ్యాచ్‌లో లక్నో 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (70) , జానీ బెయిర్‌స్టో (42) రాణించారు. తొలి వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం అందించినప్పటికీ ఆ తర్వాత వచ్చినవారు అంతగా రాణించలేకపోయారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(19), జితేశ్ శర్మ(6), లివింగ్ స్టోన్ (28 నాటౌట్), సామ్ కరాన్(0), శశాంక్ సింగ్ (9 నాటౌట్) చొప్పున మాత్రమే పరుగులు చేశారు.

అరంగేట్ర ఆటగాడు మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన (గంటకు 155.8 కిలోమీటర్లు) బంతిని వేశాడు. 4 ఓవర్లు వేసిన మయాంక్ 27 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు ఇతర బౌలర్లు నవీన్ ఉల్ హాక్, కృనాల్ పాండ్యా కూడా సహకారం అందించడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, మొసిన్ ఖాన్ 2 వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (54), నికోలస్ పూరన్ (42) రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రాన్ 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 కీలకమైన వికెట్లు తీశారు.

More Telugu News