Kadiam Srihari: బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఓడిపోతానని తెలిసి కూడా పోటీకి సిద్ధపడ్డాను.. కానీ..!: కడియం కావ్య

  • పార్టీలో నేతల మధ్య ఉన్న విబేధాల కారణంగా తాను తప్పుకున్నట్లు తెలిపిన కడియం కావ్య
  • హరీశ్ రావు సమావేశంలోనే నేతల మధ్య పడని వాతావరణం కనిపించిందని వెల్లడి
  • పార్టీ బలహీనపడటం... కేసులు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఆందోళన కలిగించాయని వెల్లడి
Kadiyam Kavya reveals why she left brs

బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసినప్పటికీ అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చినందున తాను సిద్ధపడ్డానని... కానీ నేతల మధ్య ఉన్న విబేధాల కారణంగా తాను తప్పుకున్నానని కడియం కావ్య తెలిపారు. వరంగల్ లోక్ సభ టిక్కెట్‌ను బీఆర్ఎస్ కడియం కావ్యకు ప్రకటించింది. ప్రకటించిన కొన్ని రోజులకే తండ్రి కడియం శ్రీహరితో కలిసి ఆమె బీఆర్ఎస్ పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం బంజారాహిల్స్‌లో అనుచరులు, కార్యకర్తలతో కడియం శ్రీహరి, కడియం కావ్య సమావేశమయ్యారు.

ఈ భేటీ సందర్భంగా కావ్య మాట్లాడుతూ... బీఆర్ఎస్‌లో నాయకుల మధ్య విభేదాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయని అన్నారు. తనకు పార్టీ నుంచి టిక్కెట్ వచ్చాక రెండు మూడు రోజులు అంతా బాగానే అనిపించిందని... కానీ ఆ తర్వాత నుంచి పార్టీలో ఎవరూ తనతో కలిసి రాలేదన్నారు. తనకు టిక్కెట్ రావడంతో పార్టీలోని ముఖ్య నేతల సహకారం కోరానని... కానీ వారు తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మొన్న హరీశ్ రావు సమావేశంలో కూడా నేతల మధ్య పడని వాతావరణం కనిపించిందన్నారు. ఇక వారు తనకు ఎలా సహకరిస్తారు? అని ప్రశ్నించారు.

తాను రాజకీయాల్లోకి రావడం రావడమే... పార్టీ తరఫున పోటీ చేద్దామని భావించానని చెప్పారు. కానీ అప్పటికే పార్టీ బలహీనంగా ఉంది... దీనికి తోడు కేసులు, ఫోన్ ట్యాపింగ్ ఇలాంటివి చూస్తుంటే తనకు ఆందోళన కలిగిందన్నారు. దీనికి తోడు కడియం శ్రీహరిని ఎమ్మెల్యేగా చేయడంతో పాటు కూతురుకు ఎంపీ టిక్కెట్ ఇవ్వడంపై పార్టీలోనే కొంతమంది అసంతృప్తితో ఉన్నారన్నారు.

More Telugu News