Titanic: 'టైటానిక్' లో రోజ్ ప్రాణాలు కాపాడిన తలుపు చెక్కకు వేలంలో కళ్లు చెదిరే ధర

The door which saved Rose life  in Titanic movie gets huge price in auction
  • 1912లో ప్రమాదానికి గురై జలసమాధి అయిన టైటానిక్ నౌక
  • 1500 మంది మృత్యువాత
  • 1997లో సినిమాగా వచ్చిన టైటానిక్ ఉదంతం
  • అందులో హీరోయిన్ పాత్రధారి ప్రాణాలు కాపాడిన తలుపు చెక్క
  • తలుపు చెక్కను వేలం వేసిన ప్లానెట్ హాలీవుడ్ 
చరిత్రలో అత్యంత విషాదభరితం అనదగ్గ సముద్ర ప్రయాణాల్లో టైటానిక్ ఉదంతం ఒకటి. 1912లో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ మునిగిపోగా, దాదాపు 1500 మంది మరణించారు. నాడు ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ నుంచి 2,224 మందితో అమెరికాలోని న్యూయార్క్ కు బయల్దేరిన ఈ భారీ నౌక గమ్యం చేరకుండానే జలసమాధి అయింది. 

ఈ విషాదాంతంపై 'టైటానిక్' పేరుతో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. 1997లో వచ్చిన ఈ చిత్రం ఆస్కార్ వేదికపైనా 11 అవార్డులతో ప్రభంజనం సృష్టించింది. 

ఇక అసలు విషయానికొస్తే... టైటానిక్ చిత్రం చివరలో హీరో జాక్ (లియొనార్డో డి కాప్రియో) తన ప్రియురాలు రోజ్ (కేట్ విన్ స్లెట్) కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఒకరు మాత్రమే పట్టేంత ఓ తలుపు చెక్కపై పడుకుని గడ్డకట్టించే నీటి నుంచి రోజ్ తన ప్రాణాలు కాపాడుకోగా, ప్రియురాలి కోసం నీటిలోనే ఉండిపోయిన జాక్ చలికి గడ్డకట్టి ప్రాణాలు విడుస్తాడు. 

సినిమాలో రోజ్ ప్రాణాలు కాపాడిన ఆ తలుపు చెక్కను ఇప్పుడు వేలం వేయగా కళ్లు చెదిరే ధర పలికింది. వేలంలో రికార్డు స్థాయిలో రూ.5.98 కోట్లకు అమ్ముడుపోయింది. 

పలు సినిమాల్లో ఉపయోగించిన కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీలు ప్లానెట్ హాలీవుడ్ అనే గొలుసుకట్టు రెస్టారెంట్-రిసార్ట్ యాజమాన్యం అధీనంలో ఉన్నాయి. ఇప్పుడా సంస్థ టైటానిక్ చిత్రంలో ఉపయోగించిన తలుపు చెక్క సహా పలు వస్తువులను వేలం వేసింది. 

ఇండియానా జోన్స్ చిత్రంలో ఉపయోగించిన కొరడాను వేలం వేయగా... ఆ కొరడాకు రూ.4.3 కోట్ల ధర పలికింది. స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో ఉపయోగించిన స్పైడర్ మ్యాన్ సూట్ కు రూ.1.04 కోట్లు ధర పలికింది.
Titanic
Door
Rose
Jack
Auction

More Telugu News