Sabitha Indra Reddy: సోషల్ మీడియా ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రచారం... నాకు మంత్రి పదవి రిజర్వ్ చేశారట!: సబితా ఇంద్రారెడ్డి

  • చివరి శ్వాస వరకు కేసీఆర్ వెంటే ఉంటామన్న సబితా ఇంద్రారెడ్డి
  • తోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మ అన్నప్పుడల్లా తన మనసు పులకించిపోతోందన్న ఎమ్మెల్యే
  • చేవెళ్ల నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపు
Sabitha Indra Reddy on party change

సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టంవచ్చినట్లుగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని... జిల్లాలో తన కోసం ఓ మంత్రి పదవిని రిజర్వ్ చేసి పెట్టినట్లు పుకార్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... చివరి శ్వాస వరకు తాము కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. తోటి ఎమ్మెల్యేలు చేవెళ్ల చెల్లెమ్మ అన్నప్పుడల్లా తన మనసు పులకించిపోతుందన్నారు. చేవెళ్ల నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.

లోక్ సభ ఎన్నిక‌ల నేపథ్యంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. పరుగెత్తుకొచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేసుల‌కు భ‌య‌ప‌డేది లేదని... మొన్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిన్న బ్రేక్ వచ్చిందని... ఇంతమాత్రాన వెన‌క్కి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు ఎవరో తెలియకపోయినా మనం గెలిపించామని... ఈసారి మనతో మమేకమయ్యే కాసానిని గెలిపించుకుందామన్నారు. పార్లమెంట్‌లో బడుగుల గొంతు వినిపించాలంటే కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు.

More Telugu News