Harish Rao: అలా చేద్దామా?: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

  • కాంగ్రెస్ హామీలు నెరవేర్చిన చోట మేం ఓట్లు అడగం.. నేరవేర్చని చోట వారు అడగవద్దన్న హరీశ్ రావు
  • ఇదే నినాదంతో ముందుకు వెళ్దాం... గ్రామాల్లో చర్చ పెట్టాలని కార్యకర్తలు, నేతలకు పిలుపు
  • ఆరు గ్యారెంటీలు అమలు చేసే దాకా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి తెలంగాణపై ప్రేమ నటిస్తున్నారని విమర్శలు
Harish Rao challenges CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ చేశారు. రూ.15వేల రైతుబంధు, రైతు భరోసా, తులం బంగారం, పంటకు బోనస్, మహిళలకు రూ.2500 ఇచ్చిన చోట మేం ఓటు అడగం... ఇవ్వని చోట మీరు అడగవద్దని సవాల్ చేశారు. ఇదే నినాదంతో ముందుకు వెళదామని... గ్రామాల్లో ఈ అంశంపై చర్చ పెట్టాలని పార్టీ కేడర్‌కు సూచించారు. శుక్రవారం దుబ్బాకలో నిర్వహించిన సభలో హరీశ్ రావు మాట్లాడుతూ... మొన్న అసెంబ్లీలో హామీల అమలుపై నిలదీశామని... ఆరు గ్యారెంటీలు అమలు చేసే దాకా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామన్నారు.

లోక్ సభ ఎన్నికలు 100 రోజుల పాలనకు రెఫరెండమని రేవంత్ రెడ్డి అంటున్నారని... మరి రూ.4వేల పెన్షన్, రైతుబంధు, రైతు భరోసా, తులం బంగారం, పంటకు బోనస్ వచ్చాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఇక హామీలను ఎప్పటికీ నెరవేర్చరని విమర్శించారు. మొన్న రఘునందన్ రావుకు సురుకు పెట్టినట్లు మెదక్‌లో కాంగ్రెస్ పార్టీకి పెట్టాలని కోరారు. కేసీఆర్ లేకుంటే నీళ్లు వచ్చేవా? అన్నారు. రఘునందన్ రావు కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ఏ రోజైనా జై తెలంగాణ అన్నాడా? అని నిలదీశారు. ఉద్యమంలో అనలేదు... ఇప్పుడు సీఎం అయ్యాక కూడా అనడం లేదని విమర్శించారు.

తెలంగాణపై ప్రేమ నటిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమంలో తాము దెబ్బలు తిన్నామని... పోరాటం చేశామన్నారు. మెదక్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలిచి తీరాల్సిందే అన్నారు. అయిదేళ్ళ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని... దీనిని ఎవరూ ఆపలేరని జోస్యం చెప్పారు. కొంతమంది నాయకులు.. అధికారులు ఎక్కువ చేస్తున్నారని... అన్నీ రికార్డ్ చేస్తున్నామని హెచ్చరించారు. మనం అధికారంలో ఉన్నప్పుడు సమస్యలపై దృష్టి సారించామని... కాంగ్రెస్ ప్రభుత్వం కేసులపై దృష్టి సారించిందని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి పేగులు మెడలో వేసుకోవడం కాదు... పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి... మానవ బాంబు కావడం కాదు... మానవతా విలువల కోసం మాట్లాడాలని హితవు పలికారు. కార్యకర్తలు ఎవరూ నిరాశపడవద్దని... ఏ కష్టమొచ్చినా తాను, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండండి... ఎవరికీ భయపడవద్దని ధైర్యం చెప్పారు.

More Telugu News