Chandrababu: కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారు: చంద్రబాబు ఫైర్

  • బనగానపల్లెలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • సంపదను సృష్టించి పేదలకు పంచుతామన్న చంద్రబాబు
  • రాష్ట్ర ప్రజలను జగన్ దివాలా తీయించారని మండిపాటు
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మూడు పార్టీలు కలిశాయని వ్యాఖ్య
  • నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన
Chandrababu fires on Jagan

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లెలో చంద్రబాబు ప్రచారం కొనసాగుతోంది. బనగానపల్లెకు హెలికాప్టర్ లో చేరుకున్న బాబుకు టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి చంద్రాబు రోడ్ షో నిర్వహించారు. ప్రస్తుతం పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద ఆయన ప్రసంగిస్తున్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... రాజకీయ, పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది టీడీపీనే అని చెప్పారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. పేదల సంక్షేమం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని చెప్పారు. పేదలకు రూ. 2కే బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దని కొనియాడారు. సంపదను సృష్టించి పేదలకు పంచడమే టీడీపీ ధ్యేయమని చెప్పారు. నదులను అనుసంధానం చేయాలనే బాధ్యతను తీసుకున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని తెలిపారు. వైసీపీ వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణం ఆగిపోయిందని విమర్శించారు. 

ఏపీకి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ చేశామని చెప్పారు. జగన్ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని... అప్పులు పుట్టకపోతే పథకాలు ఉండవని అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ దివాలా తీయించారని దుయ్యబట్టారు. దుర్మార్గుడు జగన్ ను గద్దె దించడమే లక్ష్యమని చెప్పారు. ఫ్యాన్ ను చెత్తకుప్పలో వేయకపోతే మనకు భవిష్యత్తు లేదని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు రూ. 1,500 ఇస్తామని తెలిపారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ ఇస్తామని చెప్పారు.

నాసిరకం మద్యంతో జనాలు అనారోగ్యం పాలవుతున్నారని.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రూ. 12 వేల కోట్లను ఖర్చు చేసి ప్రాజెక్టులను పరుగులు పెట్టించానని.. జగన్ ఖర్చు చేసింది రూ. 2 వేల కోట్లు మాత్రమేనని విమర్శించారు. జగన్ 102 ప్రాజెక్టులను రద్దు చేశారని మండిపడ్డారు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్ మోసం చేశారని... ఉద్యాగాలను ఇచ్చే బాధ్యత తనదని అన్నారు. సీఎం నివాసానికి వెళ్లిన కంటెయినర్ లో వంట పాత్రలు ఉన్నాయని ఒకడు, ఫర్నిచర్ ఉందని మరొకడు మాట్లాడారని... ఆ కంటెయినర్ లో ఎన్నికల్లో పంచేందుకు సిద్ధం చేసిన అవినీతి సొమ్ము ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో సానుభూతి కోసం జగన్ కోడికత్తి డ్రామాలు ఆడాడని ఎద్దేవా చేశారు.

More Telugu News